చంద్రబాబు 4.0.. కీలక నిర్ణయం!

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పలువురు అధికారుల తీరు సరిగా లేకపోతే సస్పెన్షన్లకు ఆదేశాలు ఇచ్చేవారు.

Update: 2024-07-03 05:41 GMT

ఆంధ్రప్రదేశ్‌ ను పరిపాలించిన ముఖ్యమంత్రులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో వ్యవహార శైలి ఉంది. వీరిలో చంద్రబాబుకు అడ్మినిస్ట్రేటర్‌ గా పేరుంది. సీఈవో టైప్‌ సీఎం అని చంద్రబాబును గతంలో పిలుచుకునేవారు. ఎందుకంటే ఆయన ప్రతిరోజూ వివిధ ప్రభుత్వ శాఖలపై గంటల తరబడి సమీక్షలు నిర్వహించేవారు. అన్ని విషయాలను అధికారులను అడిగేవారు. చంద్రబాబుతో సమీక్ష అంటే అధికారులు హడలిపోయేవారు. ఆయన ఏం అడుగుతారో, ఏం చెప్పాల్సి వస్తుందోనని వణికిపోయేవారు.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పలువురు అధికారుల తీరు సరిగా లేకపోతే సస్పెన్షన్లకు ఆదేశాలు ఇచ్చేవారు. దీంతో అధికారులు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించేవారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తనలో 4.0 చూస్తారని ఆయనే తెలిపారు. 1995 నాటి సీఎంను చూపిస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వ శాఖ మీద సమీక్ష అయినా అరగంట (30 నిమిషాలు)లోనే ముగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలిపారు.

గతంలో గంటలకొద్దీ సుదీర్ఘ సమీక్షలు జరిగేవి. అర్థరాత్రులు వరకు కూడా సమీక్షలు జరిగిన సందర్భాలున్నాయి. దీంతో అధికారులు చంద్రబాబును చాటుగా తిట్టుకునేవారు. కానీ ఇప్పుడు సమీక్షలను అరగంటలోనే ముగించాలని నిర్ణయించారు. అది ఎలాంటి సమీక్ష అయినా అరగంట మించకుండా చూసుకోవాలని మంత్రులకు కూడా చంద్రబాబు సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజాగా ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై చంద్రబాబు మూడు సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షల్లో ఆయా శాఖల మంత్రులు కొల్లు రవీంద్ర, రామ్‌ ప్రసాద్‌ రెడ్డి, నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఒక్కో శాఖపై సమీక్షను చంద్రబాబు కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేయడం విశేషం. తాను అధికారులకు చెప్పేదానితోపాటు అధికారులు తనకు చెప్పేది కూడా మొత్తం అర గంటలోనే పూర్తయ్యేలా చంద్రబాబు చూశారు. దీంతో శాఖల వారీ సమస్యలను అధికారులు ఆయన ముందు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఆయన ముందుపెట్టారు.

చంద్రబాబులో వచ్చిన మార్పును చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో సమీక్షలు అంటే సీఎం కోసం గంటల కొద్దీ వేచిచూసేవాళ్లమని.. ఆ తర్వాత ఆయన వచ్చాక గంటలపాటు సమీక్షలు జరిగేవని గుర్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ తాము ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి అర్థరాత్రి అయిపోయేదని అంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఒక్కో శాఖపై సమీక్షను అరగంటలోనే పూర్తి చేయడం తమను ఆశ్చర్యపరిచిందని అధికారులు చెబుతున్నారు. తాము ఏం చెప్పాలనుకున్నా 20 నిమిషాల్లోనే చెప్పాలని సీఎం కోరారన్నారు.

Tags:    

Similar News