బాబుకు ఐటీ నోటీసులు... వైసీపీకి చెలగాటం..!

చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు ఎపుడూ ఉన్నాయి. ఆయన మీద ఏ కోర్టు ఇంతవరకూ తప్పు ఇది అని నిరూపించలేకపోయింది

Update: 2023-09-05 04:08 GMT

చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు ఎపుడూ ఉన్నాయి. ఆయన మీద ఏ కోర్టు ఇంతవరకూ తప్పు ఇది అని నిరూపించలేకపోయింది. ఆయన కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని వెళ్ళదీస్తున్నారు అని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ దేశంలో చాలా మంది కోర్టు బోను ఎక్కారు నిందితులుగా ఉన్నారు జైలుకు వెళ్లారు. మహా మహులు అంతా కూడా జైలు ఊచలు లెక్కబెట్టారు.

కానీ చంద్రబాబు మాత్రం ఏ రోజూ అలాంటి పరిస్థితి తెచ్చుకోలేదు. దాన్ని బాబు వ్యవస్థలు మేనేజ్ చేసి అలా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే బాబు రాజకీయ జీవితం సరిగ్గా నాలుగున్నర దశాబ్దాలు. ఆయన ఎన్టీయార్ అల్లుడిగా ఉండగా కర్షక పరిషత్ చైర్మన్ గా ఉండగా ఆయన మీద నాటి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.

ఇక సీఎం అయ్యాక అవి మరింతగా ఎక్కువ అయ్యారు. ఇపుడు చూస్తే బాబు కరెక్ట్ గా దొరికిపోయారు అని వైసీపీ నేతలు అంటున్నారు. బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చారని మంత్రులు నాయకులు అంటున్నారు. బాబు అవినీతి తీగ కదిలింది ఇక డొంక కదలడమే తరువాయి అని మంత్రి గుడివాడ అమరనాధ్ లాంటి వారు అంటున్నారు. బాబుకు ఒకసారి కాదు నాలుగు సార్లు నోటీసులను ఐటీ శాఖ ఇచ్చింది అని కూడా అంటున్నారు.

అయితే ఈ విషయంలో వైసీపీ ఎంత విమర్శలు చేస్తున్నా టీడీపీ అయితే వ్యూహాత్మకమైన మౌనాన్నే పాటిస్తోంది. ఈ కేసులో ఎంతగా రెచ్చగొట్టాలని చూసినా టీడీపీ సైలెంట్ తన ఆయుధం అంటోంది. ఇదిలా ఉంటే 2015లో ఓటుకు నోటు కేసు ఒకటి బాబు మీదకు వచ్చింది. ఆయన గొంతు కూడా బ్రీఫ్డ్ మీ అంటూ చెప్పింది సరిపోయింది కాబట్టి అది బాబే అని కూడా ప్రత్యర్ధులు అంతా అన్నారు. ఇక ఒక అర్ధరాత్రి మీడియా మీటింగ్ పెట్టి మరీ కేసీయార్ బాబుని హరిహర బ్రహ్మాదులు కూడా పట్టుకోలేరని చెప్పుకొచ్చారు.

కానీ తమాషాగా ఆ కేసు కూడా దూది పింజలా తేలిపోయింది. చంద్రబాబుకు ఏమీ కాలేదు. ఇక చంద్రబాబు మీద నాడు వైఎస్సార్ ఎన్నో కేసులు పెట్టారని అలాగే లక్ష్మీపార్వతి కేసులు పెట్టింది అని కూడా ఉంది. కానీ బాబును కనీసం కోర్టు దాకా ఏ ఒక్క కేసూ తీసుకుని రాలేకపోయాయని టీడీపీ నేతలు అంటారు. బాబు ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఆయన మచ్చలేని నాయకుడు కాబట్టే అని వారు చెప్పుకుంటారు.

అయితే బాబు ఐటీ నోటీసుల కేసులో మాత్రం ఇరుక్కున్నట్లే అని ఈసారి మొత్తం అంతా బయటకు వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బాబు ఆటలు ఇంకెంతో కాలం సాగవని అంటున్నారు.

చంద్రబాబు తన 118 కోట్ల రూపాయల కమీషన్ పై ఇక్కడున్న ఐటీ ఆఫీస్ నోటీసు ఇవ్వకుండా సెంట్రల్ ఆయకార్ భవన్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. ఓటుకు నోటు కేసులోనూ అలాగే చేశారని ధ్వజమెత్తారు. 2001లోనే తెహల్కా సంస్థ చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిందన్నారు. కానీ ఇంకెంతో కాలం చంద్రబాబు ఆటలు సాగవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి బాబు అవినీతి బండారం ఎన్నికల ముద్ను బద్ధలంది అని సీరియస్ గానే వైసీపీ పోరాటం చేస్తోంది

అయితే ఎన్నికల ముందు ఇదంతా మామూలే అని ఐటీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన అవినీతి ఎలా అవుతుంది అని తమ్ముళ్ళు వాదిస్తున్నారు. మరి చంద్రబాబు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఆయనను ఎన్నో ఎన్నికల్లో గెలిపించింది ఇదే జనం. ప్రజలకు అవినీతి పడుతుందా అంటే లేదు అనే జవాబు ఎన్నో ఎన్నికలు చెప్పాయి. మరి ఐటీ నోటీసులు ఈ కేసులు బాబుని కార్నర్ చేస్తాయా అంటే ప్రస్తుతానికైతే ఇది వైసీపీ చేతికి ఒక అస్త్రంగా ఉందని, రానున్న రోజులలో ఐటీ కేసు మలుపు తిరగాలంటే ఢిల్లీ రాజకీయాలు కూడా మారాల్సి ఉందని అంటున్నారు. చూడాలి మరి కధ అంతవరకూ సాగుతుందా లేదా అన్నది.

Tags:    

Similar News