తన అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తనను ప్రభుత్వం అరెస్టు చేయిస్తుందని హాట్‌ కామెంట్స్‌ చేశారు

Update: 2023-09-06 10:47 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తనను ప్రభుత్వం అరెస్టు చేయిస్తుందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. రేపో, మాపో తనను అరెస్టు చేసినా చేయిస్తారన్నారు. తనపై దాడులు కూడా చేస్తారని ఆరోపించారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఏదో కంపెనీని తెరమీదకు తెచ్చి.. అందులో తనను ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెబితే డబ్బు కూడా ఇస్తామని వారికి ఆశపడుతున్నారని ఆరోపించారు.

జగన్‌ తండ్రి రాజశేఖరరెడ్డి కూడా గతంలో తనపై 26 ఎంక్వైరీలు వేశారన్నారు. అయితే ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయారని చంద్రబాబు గుర్తు చేశారు. నిప్పులా బతికానని.. తాను ఏ తప్పూ చేయలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని చంద్రబాబు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడీ జరిగిందని ఆరోపణలు చేశారు.

వైసీపీ విధ్వంస పాలనను ప్రజలంతా చూస్తూనే ఉన్నారని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌.. సైకో సీఎం మాత్రమే కాదు... కరడుగట్టిన సైకో అని మండిపడ్డారు. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని ధ్వజమెత్తారు. తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమాలపై ఎన్‌జీటీలో కేసులు వేసిన నాగేంద్రను ఇలాగే వేధిస్తున్నారని ఆరోపించారు. రేపో, ఎల్లుండో తనను కూడా అరెస్టు చేయొచ్చన్నారు. లేకుంటే దాడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని వారే హత్య చేసి మరుసటి రోజు సాక్షి పత్రికలో తనపై నారాసుర రక్త చరిత్ర అని రాశారని గుర్తు చేశారు. అనేక రకాలుగా అపవాదులు వేశారని... రివర్స్‌ లో కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అంగళ్లలో తన మీద హత్యాప్రయత్నం చేసి పైగా తన మీదే 307 కేసు పెట్టారన్నారు. తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్‌మెంట్లు రాయిస్తున్నారని మండిపడ్డారు.

తన కుమారుడు లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళంకు వచ్చి దాడులు చేసి కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి కరుడుగట్టిన సైకో అని... సైకో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌ కు బటన్‌ నొక్కడం ఒక్కటే తెలుసని ... ఇచ్చిన డబ్బులకంటే పేపర్‌ ప్రకటనలకు ఎక్కువ ఇచ్చారన్నారు.

Tags:    

Similar News