చంద్రబాబును ఉంచిన స్నేహ బ్యారక్‌ ప్రత్యేకతలు ఇవే!

సాధారణంగా ఆర్థిక నేరాలు చేసి రిమాండ్‌ కు వచ్చే ఖైదీలకు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోని స్నేహ బ్యారక్‌ ను కేటాయిస్తారని చెబుతున్నారు

Update: 2023-09-12 03:54 GMT

2014-19 మధ్య కాలంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అక్కడ చంద్రబాబును స్నేహ బ్యారక్‌ అని ప్రత్యేక బ్యారక్‌ లో ఉంచారు.

ఈ నేపథ్యంలో 'స్నేహ బ్యారక్‌' రాష్ట్రవ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. దాని ప్రత్యేకత ఏమిటి? అందులో ఏ వసతులు ఉన్నాయి వంటివాటిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్నేహ బ్యారక్‌ విశేషాలు ఇవి...

సాధారణంగా ఆర్థిక నేరాలు చేసి రిమాండ్‌ కు వచ్చే ఖైదీలకు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోని స్నేహ బ్యారక్‌ ను కేటాయిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడిగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అదే బ్యారక్‌ కేటాయించారు. దీంతో స్నేహ బ్యారక్‌ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

కాగా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. 1602లో మనదేశంలో కొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్న డచ్‌ దేశస్థులు ప్రస్తుతం సెంట్రల్‌ జైలు ఉన్నచోట కోట నిర్మించారని తెలుస్తోంది. దానిని 1864లో బ్రిటిష్‌ పాలకులు జైలుగా మార్చారని చెబుతున్నారు. ఇక 1870లో దీన్ని పూర్తి స్థాయి కేంద్ర కారాగారంగా తీర్చిదిద్దారు. 190 ఎకరాల్లో విస్తరించిన జైలులో సుమారు 152.76 ఎకరాలు ఖాళీ స్థలం కాగా, 37.24 ఎకరాల్లో మాత్రమే భవనాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పట్లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరకపోవడం గమనార్హం. ఇటీవలే కొన్నింటిని ఆధునికంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు.

కాగా రాజమండ్రి సెంట్రల్‌ జైలును అత్యంత భద్రతతో కూడిన జైలుగా పేర్కొంటున్నారు. కరడుగట్టిన నేరస్తులను ఈ కారాగారంలో ఉంచుతారని ప్రతీతి. ఈ జైల్లో చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 11 బ్లాక్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ఒక్కో బ్లాక్‌ లో కనిష్టంగా 6 రూములు చొప్పున మొత్తం 52 గదులు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఆధునిక వసతులతో నిర్మించిన స్నేహ బ్లాక్‌ లో 13 గదులు ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబు రిమాండ్‌ కు రావడంతో అప్పటికే అక్కడ ఉన్న ఖైదీలను ఖాళీ చేయించి బ్యారక్‌ మొత్తం ఆయనకే కేటాయించారని చెబుతున్నారు. అందులో ఒక గదిని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేసి చంద్రబాబుకు కేటాయించారని తెలుస్తోంది. గదిలో ఫ్యాన్, సేదతీరేందుకు సౌకర్యమైన బెడ్, న్యూస్‌ పేపర్, ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే టీవీ మాత్రం లేదని తెలుస్తోంది. టీవీ మాత్రం అందరితో కలిసి కామన్‌ ఏరియాలో చూడాల్సిందేనని అంటున్నారు.

Tags:    

Similar News