కంచుకోటలో ఈసారి టీడీపీ పాగా వేసేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలై ఉన్నాయి

Update: 2024-01-24 10:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలై ఉన్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే నాలుగు విడతల్లో అసెంబ్లీ, పార్లమెంటు కలిపి 68 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రేపు, మాపో ఐదో విడత అభ్యర్థుల జాబితా కూడా విడుదలవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ, జనసేన కూటమి కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని టాక్‌ నడుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పలుమార్లు సమావేశమై చర్చించారు.

కాగా టీడీపీకి కంచుకోటల్లో ఒకటి.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నిడదవోలు కొత్తగా ఏర్పడింది. ఈ క్రమంలో 2009, 2014 ఎన్నికల్లో టీడీపీకి చెందిన బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈసారి తమ కంచుకోటలో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉందని అంటున్నారు.

నిడదవోలు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. గతంలో రెండు పర్యాయాలు గెలుపొందిన బూరుగుపల్లి శేషారావు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఈసారి ఈయనతోపాటు కుందుల సత్యనారాయణ కూడా నిడదవోలు టికెట్‌ ను ఆశిస్తున్నారు. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో చంద్రబాబు ఎవరికి సీటు కేటాయించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు.

జనసేన పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ నిడదవోలులో టీడీపీనే పోటీ చేస్తుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నిడదవోలులో జనసేనకు దాదాపు 23 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే గతంలో రెండు పర్యాయాలు టీడీపీనే ఇక్కడ గెలుపొందడంతో ఆ పార్టీకే జనసేన ఈ సీటును వదిలేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

మరోవైపు వైసీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడే పోటీ చేయొచ్చని చెబుతున్నారు. 2009లో ఈయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శేషారావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనపైనే శ్రీనివాస నాయుడు వైసీపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు.

Tags:    

Similar News