జగన్ వర్సెస్ బాబు : ఇద్దరూ ఇద్దరే !

వారిద్దరూ అంత కసిగా పట్టుదలగా పనిచేశారు కాబట్టే ఏపీ ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

Update: 2024-06-03 18:57 GMT

అవును విజయం ఎవరో ఒకరినే వరిస్తుంది. కానీ ఎక్కడా తగ్గకుండా ఎన్నికల కురుక్షేత్రంలో ఏ మాత్రం అలసిపోకుండా ఇటు జగన్ అటు చంద్రబాబు చూపిన పోరాట పటిమకు శభాష్ అని తీరాల్సిందే అంటున్నారు. వారిద్దరూ అంత కసిగా పట్టుదలగా పనిచేశారు కాబట్టే ఏపీ ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

అంతే కాదు ఏ సర్వే సంస్థ అంచనాలకూ అందనంతగా అవి నిలిచాయి. గెలుపు కోసం ఈ ఇద్దరు నేతలూ పన్నిన వ్యూహాలు కానీ రాజకీయాలు శ్వాసగా చేసుకుని సాగించిన పోరు కానీ స్పూర్తిదాయకమనే అని అంటున్నారు. తొలి నుంచి ఒకే టెంపోని ఇద్దరూ కంటిన్యూ చేశారు.

అందువల్లనే ఏ పార్టీ ముందు ఏ పార్టీ వెనక అన్నది ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఎవరు విజేత అన్నది చెప్పడం తలపండిన రాజకీయ పండితులకు కూడా కష్టసాధ్యమైంది అంటే ఆ ఇద్దరు ప్రత్యర్ధుల ప్రతిభా పాటవాలకే అది నిదర్శనం అని అంటున్నారు.

జగన్ మూడు ఎన్నికలను చూశారు. చంద్రబాబు ఇప్పటికి పది ఎన్నికలను చూశారు. ఏడున్నర పదుల వయసులో బాబు తాను నవ యువకుడినే అని ముందు నిలిచి శ్రేణులను కదిలించారు. బాబు వంటి రాజకీయ ఉద్ధండుడు అవతల పక్కన ఉన్నా అంతే ధీటుగా అదే ధైర్యంతో తలపడిన సాహసం జగన్ ది. బాబు రాజకీయ అనుభవం నాలుగున్నర దశాబ్దాలు. అదే జగన్ ది పదిహేనేళ్ళు మాత్రమే.

అయినా కూడా రాజకీయ రణ క్షేత్రంలో సమ ఉజ్జీలుగా అనిపించారు. ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ అని చెప్పడానికి కూడా అసలు కుదరని పరిస్థితి ఉంది. ఏపీ రాజకీయాల్లో ఇంతలా పట్టుదలతో రాజకీయాలను చేసిన నేతలు గతంలో లేరు అనే చెప్పాలి. ఎన్నికలను వారు ఒక స్థాయి వరకే తీసుకునే వారు.

కానీ దానిని అంతకు మించి అని భావిస్తూ లైఫ్ అండ్ డెత్ స్టేజ్ కి తెచ్చిన ఘనత కూడా ఈ ఇద్దరు నేతలకే దక్కింది. బాబు కానీ జగన్ కానీ తామే ఒక సైన్యంగా ముందుకు కదిలారు. తమ చుట్టూనే అన్నీ అంతా అనిపించారు. తమతోనే ఏదైనా అని కూడా అనిపించారు. అందుకే ఆ ఇద్దరూ ఇద్దరే.

ఈ ఇద్దరిలో ఏ ఒక్కరో గెలిచి విజేత కావచ్చు. కానీ పోరాటంలో చివరి అంకం వరకూ వచ్చి గెలుపు తలుపు ఆవల నిలిచిన రెండవ వారిని కూడా విజేతగానే చూడాలి. అలా ఏపీలో నెవర్ బిఫోర్ అన్నట్లుగా జరిగిన ఈ రాజకీయ సమరం చరిత్రలో పదిలంగా ఉంటుంది. మళ్లీ ఇలాంటి పోరు మాత్రం ఫ్యూచర్ లో జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరిలా మరే ఇద్దరూ ఉండే చాన్సే లేదు కాబట్టి.

Tags:    

Similar News