సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిషన్!

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏపీ సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న చంద్రబాబు... మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Update: 2023-09-23 08:11 GMT

ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాం కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏపీ సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న చంద్రబాబు... మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ ను క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో క్వాష్‌ పిటిషన్‌ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శనివారం సుప్రీంను ఆశ్రయించారు. ఇందులో భాగంగా... చంద్రబాబు నాయుడు అరెస్ట్ చెల్లదని, ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారని తెలుస్తుంది.

దీంతో సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఈ పిటిషన్‌ ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉందని తెలుస్తుంది.

కాగా, కేసు దర్యాప్తు తుది దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ పై వ్యాఖ్యానించిన హైకోర్టు.. దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు కాపీ వెలువడిన అనంతరం ఈ తీర్పును టీడీపీ లీగల్ టీం, బాబు తరుపు సీనియర్ న్యాయవాదులూ అధ్యయనం చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు! దీంతో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

మొదటికే మోసం..?:

సుప్రీంకోర్టులో చంద్రబాబు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేయడాన్ని కొంతమంది సన్నిహితులు వద్దని వారిస్తున్నారని తెలుస్తుంది. అందుకు వారు చెబుతున్న కారణం... గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఏపీ హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ ని కొట్టేసిందని అంట!

ఈ సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్తే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో చెప్పిన కారణాలే అక్కడ కూడా చెప్తారు.. పైగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులనే ఉదహరిస్తూ వారి వాదనలు సాగుతున్న పరిస్థితి! దీంతో కోర్టు కనీసం పిటిషన్‌ ను స్వీకరించకుండానే కొట్టేసే పరిస్థితులు ఎదురవుతాయేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారంట.

పొరపాటున అలా జరిగితే.. ఒక్కసారి సుప్రీం కోర్టులో బాబు పిటిషన్ తిరస్కరణకు గురైతే.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొనవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట.

Tags:    

Similar News