చంద్రబాబుపై కేసు... వైసీపీకి మరింత డ్యామేజ్...!
ఆయనపై హత్యానేరం సహా, కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారనే సెక్షన్లు నమోదు చేశారు
అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఈ నెల 4న చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి పోలీసులు వ్య వహరించిన తీరు అప్పట్లో ప్రజల మద్య చర్చకు వచ్చింది. ఒకవైపు ఏ పార్టీ వారో తెలియని పరిస్థితిలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. అయినప్పటికీ..వారు వెనక్కి తగ్గారు. ఈ విషయం పత్రికల్లోనూ.. ఒక వర్గానికే పరిమితమయ్యాయన్న మీడియా చానెళ్లలోనూ వచ్చింది. దీంతో ప్రజల్లో పోలీసులపై సింపతీ ఏర్పడింది.
పాపం.. అంటూ.. పోలీసులపై నెటిజన్లు కూడా సానుభూతి చూపించారు. రాళ్ల దాడిలో గాయపడిన పోలీసులకు సంఘీభావం కూడా ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా పోలీసులు.. ఈ కేసులో కీలక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు 80 మందిని అరెస్టుచేశారు. వారిపై అనేక కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ వారిని కోర్టుకు హాజరు పరచలేదు. ఇదిలావుంటే, తాజాగా పుంగనూరు ఘటనలకు సంబంధించి ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
ఈ కేసుల్లో చంద్రబాబును ఏ-1గా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయనపై హత్యానేరం సహా, కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారనే సెక్షన్లు నమోదు చేశారు. సుమారు 8 సెక్షన్ల కింద వివిధ కేసులు కూడా నమోదు చేశారు. అయితే.. దీనివల్ల వైసీపీకి వచ్చే ఇమేజ్ కానీ, పోలీసులకు పెరిగే ఇమేజ్ కానీ ఏమీ ఉండదని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు ఇదే విషయంపై వైసీపీలోనూ చర్చ సాగుతోంది. చంద్రబాబుపై కేసు నమోదు చేయడం సరికాదని తటస్థ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
''ఎన్నికల సమయం వచ్చేసింది. ఇప్పటికే 70 ఏళ్ల వయసులోనూ కాలికి బలపం కట్టుకున్నట్టుగా చంద్ర బాబు ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఆయనపై ప్రజల్లో సింపతీ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయనపై కేసులు నమోదు చేయడం మంచిది కాదు. ఈ సింపతీని మరింత పెంచినట్టే అవుతుంది. దీనివల్ల మాకే నష్టం'' అని చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, తటస్థ నాయకుడిగా పేరున్న ఓ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.