ఏపీ: ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం.. బాబు అదిరే స్లోగన్
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు తన ప్రాధామ్యాలేంటో స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు తన ప్రాధామ్యాలేంటో స్పష్టం చేశారు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న సమయంలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే సందర్శించారు. గత పాలనలో ప్రతి సోమవారం పోలవారంగా నామకరణం చేశారు. దీనికితగ్గట్లే ఆ ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించింది. ఇక రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించారు. 2016 దసరా సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేయించారు.
జీవ నాడి
80 ఏళ్లుగా పోలవరం అనేది ఓ సజీవ కల. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకనో, పరిస్థితులు అనుకూలించకనో.. అసలు పట్టించుకోకనో.. అవినీతి కారణంగానో.. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తికాలేదు. దీంతోపాటే మొదలైన తెలంగాణ వాదం సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రం కూడా ఆవిర్భవించింది. అన్నట్లు తెలంగాణకు పోలవరంతో పెద్ద నష్టం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాచలం పోలవరం తిరుగు జలాల ముప్పును ఎదుర్కోనుంది. మరోవైపు ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగానే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడు మండలాలు ముంపులో కలిసేవి. ఇవి గనుక విభజిత ఏపీ పరిధికి రాకుంటే పోలవరం నిర్మాణానికి పెద్ద చిక్కులే. దీంతోనే 2014లో ఆ మండలాలను కలిపాకే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు చంద్రబాబు పదేపదే చెప్పారు. కాగా, పోలవరం గనుక పూర్తయి ఉంటే ఏపీకి జీవనాడి అయ్యేది.
రాజధానికి రూపు
కనీసం రాజధాని కూడా లేకుండా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ కు అమరావతి పేరిట రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నించారు. 2019 వరకు అక్కడ రూ.వేల కోట్ల పనులు చేసినట్లు చెబుతారు. అయితే, 2019లో టీడీపీ ఓటమితో అంతా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వ్యూహంతో వెళ్లడంతో అమరావతిలో నిర్మాణాలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంది. తాజాగా చంద్రబాబు అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లి మోకాళ్లపై ప్రణమిల్లారు. ఈ సందర్భంగా ఆయన అదిరిపోయే స్లోగన్ ఇచ్చారు.
ఏపీలో ఏ అంటే అమరావతి అని.. పీ అంటే పోలవరం అని ప్రకటించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పతాక అమరావతి అని చెప్పక తప్పదు. చెన్నై, హైదరాబాద్ ను వదులుకున్న అనుభవాల నేపథ్యంలో వారికి ఓ అద్భుత రాజధాని అవసరం. ఇక సాగునీటి పరంగా దేశంలోనే పెద్ద ప్రాజెక్టుగా మిగిలిపోతుంది పోలవరం. వందల టీఎంసీల నీటిని ఒడిసిపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ నిజంగానే అన్నపూర్ణ అవుతుందనడంలో సందేహం లేదు.