బీజేపీతో చెలిమికి బాబు కొత్త ప్రపోజల్స్...!?
అంటే రేపటి ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరం అయిన మద్దతు లభించకపోతే టీడీపీ ఆపన్న హస్తం ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటుందని చెప్పడం అన్నమాట.
రాజకీయాల్లో చెలిమి చాలా రకాలుగా ఉంటుంది. అది నేరుగా ఉండొచ్చు. ఇండైరెక్ట్ గా ఉండొచ్చు. అవసరం అయినపుడు ఆదుకుని మళ్లీ తెర వెనుక వెళ్ళిపోయే స్నేహం కావచ్చు. ఇవన్నీ అందరూ చూశారు కానీ ఒక వింత చెలిమిని బీజేపీతో చంద్రబాబు కోరుకుంటున్నారని ప్రచారం అయితే ఉంది. ఆ వింత చెలిమి పేరు పోస్ట్ డేటెడ్ స్నేహం. అంటే దాని మీద డేట్ ఈ రోజుది ఉండదు. ఎన్నికల తరువాత ఫలితాలు వచ్చాక అపుడు అక్కరకు వస్తే తెలుగుదేశం పేరు రాసుకుంటే చాలు అటోమేటిక్ గా బీజేపీకి టీడీపీ గట్టి ఫ్రెండ్ అయిపోతుంది.
అంటే రేపటి ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరం అయిన మద్దతు లభించకపోతే టీడీపీ ఆపన్న హస్తం ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటుందని చెప్పడం అన్నమాట. ఇదే మా మాట. నమ్మండి ఎన్డీయేలోకి ఎన్నికల తరువాత చేరుతామని ఇపుడు మాత్రం పొత్తులు పక్కన పెట్టి మా వైపు అలా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉండండి చాలు అని టీడీపీ నుంచి ఒక ప్రపోజల్ కేంద్ర నాయకత్వానికి వెళ్ళింది అని అంటున్నారు.
ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో చేరుతుందని వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తాజాగా మీడియా ముందు చేసిన ప్రకటనలో ఏదో గ్యాప్ అయితే ఉంది అని అర్ధం అయింది. సత్యకుమార్ అన్నదేంటి అంటే టీడీపీ బీజేపీతో పొత్తు కోసం కోరుతున్నట్లుగా చెప్పాలని. అది కూడా కేంద్ర నాయకత్వంతో చర్చించాలని.
అయితే బీజేపీతో పొత్తు మీద టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటున్నారు. బీజేపీ పట్ల ఏపీ జనాలలో ఉన్న వ్యతిరేకత కాస్తా టీడీపీకి అనవసరంగా చుట్టుకుంటుంది దాని వల్ల టీడీపీ విజయావకాశాలు కూడా తగ్గిపోతాయని సర్వేలు వచ్చాయని అంటున్నారు దాంతో బీజేపీని దూరం చేసుకోలేక టీడీపీ మధన పడుతూ వస్తోంది. ఎందుకంటే ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీని తట్టుకోవాలి అంటే బీజేపీ అండ కావాలని ఉంది.
అయితే అదే సమయంలో బీజేపీతో నేరుగా అంటకాగే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను పరిశీలించిన మీదటనే వయా మీడియాగా టీడీపీ నుంచి ఈ తరహా వింత ప్రతిపాదనలు కేంద్ర బీజేపీ అధినాయకత్వానికి వెళ్లాయని అంటున్నారు. రేపో ఎల్లుడో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది.
ఆ మీటింగులో ఏపీలో పొత్తుల విషయం ఏదో ఒకటి తేల్చేస్తారు. అయితే ఆ మీటింగుకు ముందే టీడీపీ తన భావనను కేంద్ర బీజేపీ కీలక నాయకుని ద్వారా పెద్దలకు తెలియచేసింది అని ప్రచారం అయితే ఉంది. అంటే ఏపీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలన్న మాట. టీడీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతర మిత్రులతో పోటీకి దిగుతుంది.
ఎన్నికలు అయిన తరువాత బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇస్తామని చెబుతోంది. అయితే కేంద్రంలో అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో. మరి బాబుని నమ్మి బీజేపీ ఈ విధంగా ఆయనకు ఏపీ ఎన్నికల్లో అండగా ఉంటుందా లేదా అన్నది చూడాలని అంటున్నారు. మొత్తానికి బీజేపీకి దూరంగా ఉండాలనే టీడీపీ అభిమతం అని అంటున్నారు.