పవన్ హీరోయిజంపై బాబు సరదా వ్యాఖ్యలు.. సభలో నవ్వులే నవ్వులు!
ఏపీలో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య "శాంతిభద్రతల" విషయంపై మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే
ఏపీలో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య "శాంతిభద్రతల" విషయంపై మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూని జగన్ హస్తినకు తీసుకెళ్లారు. మరోవైపు ఈ రోజు అసెంబ్లీలో జగన్ పాలనలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పవన్ పడిన ఇబ్బందులపై సరదా వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా... 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏమిటో గత ప్రభుత్వం కళ్లకు కట్టినట్లు చూపించిందని ఆయన విమర్శలు గుప్పించారు! ఈ సమయంలో వైసీపీ నేతల కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారని అన్నారు.
ఈ సందర్భంగా నాటి ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసిన చంద్రబాబు.. వాటిపై సరదాగా స్పందించారు. వాస్తవానికి... నాటి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు విచారణ నిమిత్త ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఈ నేపథ్యంలో బాబును కలిసేందుకు పవన్ ప్రయత్నించారు. ఇందులో భాగంగా రోడ్డుమార్గంలో విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని చెబుతూ ఏపీ పోలీసులు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆయనను అడ్డుకున్నారు. దీంతో... పోలీసులకు, జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ నుంచి నడుచుకుంటూ మంగళగిరి వెళ్లాలని పవన్ నిశ్చయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనను అనుమంచిపల్లిలో అడ్డుకోవడంతో నిరసనగా రోడ్డుపైనే పడుకున్నారు పవన్. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే... తాజాగా శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన బాబు నాటి ఘటనను గుర్తుచేశారు. ఇందులో భాగంగా... ఎప్పుడూ సినిమాల్లో హీరోగా కొట్టడమే తెలిసిన పవన్ కల్యాణ్ కూడా రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందని బాబు అన్నారు.
ఇదే సమయంలో... అదే సినిమాల్లో అయితే పడుకునేవారు కాదని.. అక్కడే పైకి ఎగిరి కొట్టేవారని అన్నారు. బాబు అలా సరదాగా వ్యాఖ్యానించే సరికి పవన్ కల్యాణ్ తో పాటు సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు.