చంద్రబాబు నాలుగు వేల పెన్షన్ మీద నమ్మకం లేదా ?

చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ళు పాలించినపుడు ఆయన ఇచ్చిన సామాజిక పెన్షన్ వేయి రూపాయలు మాత్రమే

Update: 2024-04-21 03:36 GMT

టీడీపీ అధినేత సూపర్ సిక్స్ అంటూ ఏడాది కాలంగా ప్రజలలోకి వెళ్తున్నారు. అదే విధంగా ఆయన ప్రతీ సభలో కొత్త హామీలు కూడా అనేకం ఇస్తున్నారు. అందులో ముఖ్యమైనది నాలుగు వేల రూపాయలు వంతున సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పడం.

చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ళు పాలించినపుడు ఆయన ఇచ్చిన సామాజిక పెన్షన్ వేయి రూపాయలు మాత్రమే. అయితే పాదయాత్ర సందర్భంగా ఆనాడు వైసీపీ అధినేత జగన్ తాము అధికారంలోకి వస్తే ఆ పెన్షన్ ని రెండు వేలకు చేస్తామని ప్రకటించారు. దాంతో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు రెండు వేల రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఇచ్చారు.

అయితే దాని మీద జగన్ మరో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మూడు వేల రూపాయల దాకా దశల వారీగా పెంచుకుంటూ పోతామని జగన్ చెప్పారు. అలా ఆయన 2024 జనవరి నుంచి మూడు వేల పెన్షన్ ఇస్తూ వస్తున్నారు.

ఇక ఏపీలో చూస్తే గతంలో ముప్పయి లక్షల నుంచి నలభై లక్షల మంది దాకానే జనాలకు పెన్షన్ ఇచ్చేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పెన్షన్ ని 66 లక్షల మంది దాకా పెంచారు. ఇక ఇపుడు వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని తాము అధికారంలోకి వస్తే దశల వారీగా ఇస్తామని ప్రకటించబోతున్నారు అని ప్రచారం సాగింది.

అయితే దానికంటే ముందు అన్నట్లుగా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని భారీ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసి కూడా చాలా రోజులు గడచాయి. కానీ దానికి అనుకున్నంతా పాజిటివ్ రియాక్షన్ అయితే రాలేదు అని అంటున్నారు.

దానికి కారణం చంద్రబాబు వస్తే పెన్షన్ నిజంగా పెంచుతారా అలాగే అందరికీ ఇస్తారా అదే విధంగా మరోసారి జన్మభూమి కమిటీలు పెట్టి తమకు పెన్షన్ దక్కకుండా చేస్తారా ఇలాంటి సందేహాలు అయితే చాలానే ఉన్నాయి. దాంతోనే జనంలో పెద్దగా స్పందన లేదని అంటున్నారు.

మరీ ముఖ్యంగా చూస్తే గ్రామాలలో దీని మీద ఎవరూ నమ్మడం లేదు అని అంటున్నారు. అక్కడ చర్చ కూడా ఏ విధంగానూ సాగడం లేదు అని అంటున్నారు. మూడు వేల రూపాయలు పెన్షన్ వారికి ఈ రోజున అందుతోంది. మరో వేయి రూపాయలు సడెన్ గా పెంచడం అంటే నిజంగా సంతోషించాల్సిన విషయం.

కానీ అలా జరగడంలేదు అంటే ఇక్కడే నాయకుడు విశ్వసనీయత అని అంటారు. ఒక నాడు ఒక హామీని ఇచ్చినపుడు ఆయన ట్రాక్ రికార్డు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇటీవల కాలంలో ఎన్నికల్లో కనిపిస్తోంది. అది కూడా ప్రజలలో పెరుగుతున్న చైతన్యం వల్ల కూడా జరుగుతోంది. తాము హామీలు ఎన్ని అయినా ఇవ్వవచ్చు. జనాలు నమ్ముతారు అనుకుంటే ఆ రోజులు పోయాయని దేశంలో చాలా చోట్ల జరిగిన ఎన్నికలు కూడా నిరూపించాయి.

దానికి ఆ మధ్య జరిగిన యూపీ ఎన్నికలను కూడా ఉదాహరణగా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చూస్తే కనుక బీజేపీ ఉచిత హామీలు అయితే పెద్దగా ఇవ్వలేదు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఎస్పీ కూటమి మాత్రం భారీగానే హామీలు ఇచ్చింది. నిజానికి అవి ఎంతో ఆకర్షణీయంగానూ ఉన్నాయి. కానీ జనాలు వాటి వైపు చూడలేదు. మరోసారి బీజేపీని యూపీలో గెలిపించారు.

ఇపుడు ఏపీలో చూసినా హామీలు విచ్చలవడిగా ఇస్తున్న వైనం కనిపిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రణాళిక అయితే టీడీపీ రిలీజ్ చేయలేదు. కానీ ఈ హామీలను జనాలలో పెడితే మాత్రం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే అంటున్నారు.

ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే 2014 నుంచి 2019 మధ్య ఆయన ఇచ్చిన హామీలను కూడా చూస్తున్నారు. ఆనాడు అన్నా క్యాంటీన్లు అయినా నిరుద్యోగ భృతి వంటివి అయినా ఎన్నికలకు కొద్దొ రోజుల ముందే శ్రీకారం చుట్టారు అని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే రైతు రుణ మాఫీ విషయంలోనూ ఎన్నో చెప్పి చివరికి దానిని పలుచన చేశారు అన్న మాట ఉంది. డ్వాక్రా మహిళల విషయంలోనూ హామీల సంగతి అలాగే ఉంది.

దాంతోనే జనాలు ఇపుడు బేరీజు వేసుకుంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక జగన్ విషయమే తీసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా డోర్ టూ డోర్ ఇప్పించారు. అలా పెన్షన్లు తమకు బాబు అధికారంలోకి వస్తే ఇస్తారో ఇవ్వరో అన్న బెంగ కూడా ఉంది అంటున్నారు. మొత్తానికి ఎంతో ఆర్భాటంగా బాబు నాలుగు వేల పెన్షన్ అని ప్రకటించినా స్పందన మాత్రం పెద్దగా లేదు అనే అంటున్నారు.

Tags:    

Similar News