చంద్రబాబు ప్రమాణస్వీకారంలో హైలెట్ అంటే ఇదే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు గెలుచుకుని అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును తమ శాసనసభ పక్షా నేతగా ఎన్డీయే సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసి ప్రతిని సమర్పించారు. గవర్నర్ ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని కోరారు.
చంద్రబాబు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యారు. దివంగత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ భావోద్వేగంతో కన్నీరుపెట్టారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తదితరులు ఆనందంతో చప్పట్లు కొట్టారు.
ఇక చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా అÔó ష సంఖ్యలో హాజరైన సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతోపాటు ఈ కార్యక్రమానికి హాజరైన అమరావతి రైతులు, వైసీపీ నేతల బాధిత 104 కుటుంబాలు ఆనందంతో కేరింతలు కొట్టారు.
‘నారా చంద్రబాబు అనే నేను’ అని చంద్రబాబు పలకడం ప్రారంభించగానే ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్టు సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. జై బాబు.. జైజై చంద్రబాబు, బాబు ఈజ్ బ్యాక్ వంటి నినాదాలు మిన్నంటాయి. చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని అక్కడకు హాజరైనవారు తమ మొబైల్ ఫోన్లతో బంధించడం కనిపించింది.
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశాక ప్రధాని నరేంద్ర మోదీకి, గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు నమస్కరించారు.
కాగా చంద్రబాబు తొలిసారి 1995 సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 1995 నుంచి 2004 మే వరకు వరుసగా 9 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మళ్లీ పదేళ్ల విరామం తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి చిత్తుగా ఓడిపోయింది. 23 స్థానాలకే పరిమితమైంది. చంద్రబాబును జగన్ ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయినప్పటికీ కుంగిపోకుండా తన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అండతో మరోసారి ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.