కేంద్ర పథకాలు సరే.. మ్యాచింగ్ గ్రాంట్ల సంగతేంటి?
చంద్రబాబు తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కేంద్ర పథకాలను వదల కుండా నిధులు తీసుకురావాలని అన్నారు.
కేంద్రం నుంచి వచ్చే ప్రతి ప్రాయోజిత పథకాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసలు ఏదీ మిస్ కావడానికి కూడా వీల్లేదని తేల్చి చెప్పారు. ఇది అన్ని ప్రభుత్వాలు చేసేవే. అయినప్ప టికీ.. కొన్ని కొన్ని పథకాలను మిస్ చేసుకుంటారు. దీనికి కారణం .. ఆయా ప్రభుత్వాలు ముందుగానే మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు గ్రామీణ సడక్ యోజన నిధులను ఈ దఫా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు తగ్గించేసింది.
దీనిలో కేంద్రం 45 శాతం ఇస్తానని మాత్రమే చెప్పగా.. మిగిలిన 55 శాతం నిధులను రాష్ట్ర ప్రబుత్వం భరించాలి. దీనిలోనూ తొలుత 25 శాతం నిధులను కేంద్రానికి చూపిస్తే.. విడతల వారీగా తాను ఇస్తానని చెబుతున్న నిధులను ఇస్తుంది. అదేవిధంగా ఈ సారి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్లోనూ కేంద్రం కోత పెట్టింది. పనులు ఆపేందుకు అవకాశం లేదని ఈ పథకంలో ఇప్పటి వరకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా.. రాష్ట్రాలు కేవలం 10 శాతం నిధులను మాత్రమే భరించాల్సి ఉంది.
అయితే.. దీనిని కూడా ఇవ్వకుండానే రాష్ట్రాలు కాలం గడిపేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇస్తున్న నిధులను 60 శాతానికి తగ్గించారు. అంటే.. రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుంది. అలాగే.. జల జీవన్ మిషన్‌ను రెండుగా విభజించారు. దీనిలో మేజర్ పంచాయతీలకు 60 శాతం, మైనర్ పంచాయతీలకు 85 శాతం నిధులు ఇవ్వనున్నారు. మిగిలిన సొమ్ములు రాష్ట్రాలు భరించాలి. ఈ పథకాలన్నీ.. రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన అందిపుచ్చుకోవచ్చు.
చంద్రబాబు తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కేంద్ర పథకాలను వదల కుండా నిధులు తీసుకురావాలని అన్నారు. కానీ.. ఈ ఏడాది బడ్జెట్‌లో మాత్రం కేంద్రం ముందుగా ఇచ్చే నిధులు ఏవీ కనిపించడం లేదు. ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకుని.. తర్వాత.. కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. ఇలా చూసుకుంటే.. ఏపీ ప్రబుత్వం దగ్గర ఆమేరకు నిధులు అయితే కనిపించడం లేదు. దీంతో అధికారులపై ఒత్తిడి చేసినా.. ప్రయోజనం అంతంత మాత్రమేనన్నది వాస్తవం.