మద్దిపాటి - చింతమనేని - గన్ని టిక్కెట్లు.. క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు..!
ఇక గోపాలపురం ఇన్‌చార్జ్‌గా ఉన్న మద్దిపాటి వెంకట్రాజుదే సీటు అని చంద్రబాబు ఎప్పుడో దొండపూడి సభలోనే చెప్పేశారు
ఏపీలో ఎన్నికల హీట్ మామూలుగా లేదు. వైసీపీ పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను మారుస్తూ... కొత్త వాళ్ల పేర్లను ప్రకటిస్తూ దూకుడుగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో ఒకరిద్దరు అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని చెపుతున్నా జాబితాల వారీగా పేర్లు ప్రకటించడం లేదు. అయితే పార్టీ తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థులకు ఇంటర్నల్‌గా సంకేతాలు ఇచ్చేస్తుండడంతో పాటు ఎన్నికల ప్రచారంలో దూసుకు పోవాలని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో మూడు నియోజకవర్గాలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది.
ఉంగుటూరు నుంచి ప్రస్తుత ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులకే తిరిగి టిక్కెట్ ఇచ్చేశారు. ఇక్కడ జనసేన ఆశ పడుతున్నా ఉమ్మడి జిల్లాలో ఇతర నియోజకవర్గాల ఈక్వేషన్లు, ఇటు జిల్లా పార్టీ అధ్యక్షుడు కావడంతో గన్నికి లైన్ క్లీయర్ అయ్యింది. ఈ క్రమంలోనే గన్ని ఇతర నియోజకవర్గాలపై ఫోకస్ తగ్గించి ఉంగుటూరులో పూర్తిస్థాయి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
దెందులూరులో చింతమనేనికి తప్ప వేరెవ్వరికి సీటు రాదన్నది వాస్తవం. అయితే ఇటీవల లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాసరావు అచ్చెన్నాయుడు తనను నియోజకవర్గంలో తిరగమన్నారంటూ ఒకటిరెండు రోజులు హడావిడి చేశారు. అటు అశోక్ గౌడ్ కూడా బీసీ కోటాలో తానున్నానంటూ చెప్పుకు తిరిగారు. ఎప్పుడో పది రోజుల క్రిందటే చింతమనేనికి సీటు ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్‌లో తిరుగులేని హీరోగా ఉన్న చింతమనేనికి పోటీలో ఉంటే ఈ సారి ఆ ఊపు వేరే లెవల్లో ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక గోపాలపురం ఇన్‌చార్జ్‌గా ఉన్న మద్దిపాటి వెంకట్రాజుదే సీటు అని చంద్రబాబు ఎప్పుడో దొండపూడి సభలోనే చెప్పేశారు. ఆ తర్వాత ఓ వర్గం మద్దిపాటికి సీటు ఇవ్వొద్దని పట్టుబడుతున్నా ఈ సీటు మార్చేందుకు చంద్రబాబు, లోకేష్ సుతరామూ ఇష్టపడడం లేదు. పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి పార్టీ ఆఫీస్‌కే అంకితమైన మద్దిపాటి పడిన కష్టం అధినేత, యువనేత మనసులో ఉండిపోయింది. ఇవన్నీ మద్దిపాటి సీటుకు డోకా లేకుండా చేశాయి.
ఇక మెట్టలో ఇతర సీట్ల విషయానికి వస్తే చింతలపూడి సీటు ముగ్గురు నేతలు రోషన్, అనిల్, రామారావు మధ్య దోబూచులాడుతోంది. జనసేనకు ఇచ్చే సీట్లలో ఒక్కటీ ఎస్టీ అసెంబ్లీ సీటు లేకపోవడంతో పోలవరం అనూహ్యంగా జనసేనకు ఇచ్చే సీట్ల జాబితాలో నానుతోంది. జిల్లా కేంద్రమైన ఏలూరుకు బడేటి చంటి బలమైన లీడర్ అయినా పోలవరం, ఏలూరులో జనసేనకు ఇచ్చే సీటు ఏదవుతుందన్నది చివరి వరకు సస్పెన్స్ తప్పేలా లేదు.