ఎన్డీయేలో టీడీపీ చేరేది ఎపుడంటే... బాబు చెప్పిన మాట

తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యత కోసం గత నాలుగేళ్లుగా అలుపెరగని ప్రయత్నం చేస్తోంది అన్నది తెలిసిందే

Update: 2023-08-16 16:30 GMT

తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యత కోసం గత నాలుగేళ్లుగా అలుపెరగని ప్రయత్నం చేస్తోంది అన్నది తెలిసిందే. బీజేపీ అండ ఉంటే ఏపీలో వైసీపీని గెలిచేస్తా మన్నది టీడీపీ ధీమా. దానికి తోడు సెంటిమెంట్ ని కూడా పట్టుకుంటోంది. 2014లో టీడీపీ బీజేపీ జనసేన కలసి పోటీ చేసి గెలిచాయి కాబట్టి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అవాలని టీడీపీ భావిస్తోంది.

ఇక ఆ మధ్యన అంతా ఒక్కటే చర్చ సాగింది. టీడీపీ ఎన్డీయే లో చేరిపోతుంది అని అనుకూల మీడియా సైతం తెగ ఊదరగొట్టింది. చంద్రబాబు వెళ్ళి అమిత్ షాతో భేటీ అయి వచ్చారు. దాంతో ఇంకేముంది ఎన్డీయేలోకి మళ్ళీ టీడీపీ అని అనుకున్నారు అంతా. గత నెలలో చూస్తే ఎన్డీయే మీట్ జరిగింది. దానికి చంద్రబాబుకు ఆహ్వానం అని ప్రచారం అయితే గట్టిగా సాగింది. కానీ అలా ఏమీ జరగలేదు.

ఇక టీడీపీ అయితే ఆశలు వదులుకుందా అంటే లేదు అనే అంటున్నారు. ఇంకా దానికి సమయం ఉంది అనే అంటున్నారు. ఆ మాట ఎవరో అన్నది కాదు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. ఆయన విశాఖలో విజన్ 2047 డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయేలో టీడీపీ ఎపుడు చేరుతుంది అన్న దానికి బదులిస్తూ పొత్తులకు ఇపుడు సమయం కాదని దాటవేశారు.

ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఏపీ అభివృద్ధి దేశాభివృద్ధి మీదనే ఉంది అని చెప్పుకున్నారు. తాము ఈ దేశాన్ని ఏపీని ఎలా ముందుకు నడిపించాలన్న దాని మీదనే ఆలోచన చేస్తున్నామని అన్నారు. పొత్తుల విషయంలో సరైన సమయంలో మాట్లాడుతామని అన్నారు. అంటే పొత్తులు కచ్చితంగా ఉంటాయని బాబు ఆశాభావం గా ఉన్నారని అనుకోవాల్సిందే.

బీజేపీ ఈ రోజు కాకపోయినా మరో రోజు అయినా ఏపీలో కచ్చితంగా టీడీపీతో కలసి నడుస్తుంది అన్నది బాబు ధీమాగా ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణా సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముందు ఉన్నాయి. అక్కడ కనుక బీజేపీ ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం పొత్తుల వైపు చూడక తప్పని పరిస్థితి బీజేపీకి ఉంటుందని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు.

ఇక విపక్షాల కూటమి ఇండియా ఎప్పటికపుడు భేటీ అవుతూ బలోపేతం అయ్యేలా చర్యలకు తీసుకుంటోంది. దాంతో బీజేపీ కూడా తన మిత్రులు వెతుక్కోవాల్సి ఉంది. ఏపీలో చూస్తే పొత్తులకు కలసివచ్చే పార్టీగా టీడీపీయే ఉంది. వైసీపీ బాహాటంగా పొత్తులకు అంగీకరించే సీన్ అయితే లేదు.

దాంతో టీడీపీతో పొత్తులు ఉంటాయని బీజేపీ వారు ఈ రోజుకు చెప్పకపోయినా ఏదో రోజుకు అది సాకారం అవుతుందని అంటున్నారు. ఆ ధీమాతోనే బాబు ఉన్నారని అంటున్నారు. అందుకే పొత్తుల విషయం ఇపుడు కాదని దాటవేశారు తప్ప ఎండీయేతో మేము చేరేదేమిటి అని మీడియాను ఆయన ఎదురు ప్రశ్నించలేదు అని గుర్తు చేస్తున్నారు. అంటే టీడీపీకి చాలానే ఆశలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News