అమరావతి కార్డు తీసిన చంద్రబాబు !

కానీ గుంటూరు జిల్లా తాడికొండ లో జరిగిన సభలో మాత్రం ఆయన అమరావతి మన రాజధాని అని ప్రకటించారు.

Update: 2024-04-13 15:20 GMT

ఏపీకి రాజధాని అమరావతి అని టీడీపీ అధినేత చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా చేసి అభివృద్ధి చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటిదాకా అనేక సభలలో చేసిన ప్రసంగాలలో అమరావతి రాజధాని గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ గుంటూరు జిల్లా తాడికొండ లో జరిగిన సభలో మాత్రం ఆయన అమరావతి మన రాజధాని అని ప్రకటించారు.

తాను మరోసారి గెలిస్తే ఏపీకి ఆమరావతి వంటి అద్భుతమైన రాజధాని ఉండేదని, కానీ మధ్యలో వచ్చిన జగన్ అమరావతి రాజధాని లేకుండా చేసారు అని చంద్రబాబు విమర్శించారు. అమరావతి కోసం రైతులు ముప్పయి అయిదు వేల ఎకరాలను స్వచ్చందంగా ఇచ్చారని గుర్తు చేశారు. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది దాంతో అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం ఎంతో వీలు అవుతుందని అన్నారు.

అలాగే విశాఖను ఆర్థిక రాజధానిగా ఆభివృద్ధి చేస్తామని కర్నూల్ ని అన్ని విధాలుగా ప్రగతిపథంలో నడిపిస్తామని అన్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు తురుపు ముక్కగా అమరావతి రాజధానిని బయటకు తీశారు అని అంటున్నారు. ఏపీకి రాజధాని లేదు అన్నది అయితే సగటు జనంలో ఉంది. మూడు ముక్కలాట జగన్ ఆడారని చంద్రబాబు అందుకే విమర్శిస్తున్నారు.

తాము కనుక అధికారంలోకి వస్తే ఏపీకి ఆమరావతి రాజధాని అని ఆయన అంటున్నారు. ఒక విధంగా ఎన్నికల ప్రచారం కీలక ఘట్టంలో ఉండగా ఏపీ రాజధాని అమరావతి అంటూ బాబు బిగ్ డిబేట్ కి తెర తీశారు. మరి వైసీపీ మాత్రం మూడు రాజధానులు అంటోంది. జగన్ కూటా ఇప్పటిదాకా తన ప్రచారంలో ఎక్కడా మూడు రాజధానుల గురించి మాట్లాడలేదు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాయలసీమలో జరిగింది. కర్నూల్ లో సైతం న్యాయ రాజధాని అని ఆయన ప్రకటించలేదు.

ఇపుడు చంద్రబాబు ఏపీకి ఏకైక రాజధాని అంటున్నారు. దీనికి ధీటుగా మూడు రాజధానులు అంటూ వైసీపీ రివర్స్ అటాక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఏపీలో ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికే మద్దతు ఇస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ ఏపీలో రాజధాని నిర్మాణానికి ఎంత మేరకు సాయం చేస్తుందో చెప్పాల్సి ఉంది.

ఎటూ కూటమిలో బీజేపీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఆ పార్టీ వస్తుంది కాబట్టి ఈసారి తాము అమరావతి రాజధాని పరిపూర్తికి అవసరం అయిన నిధులను ఇస్తామని బీజేపీ పెద్దలు ఏపీ పర్యటనలో ప్రకటించాల్సి ఉంటుంది. అలా కనుక చేస్తే అమరావతి రాజధాని అన్న ట్రంప్ కార్డుకు జనాల నుంచి స్పందన లభిస్తుంది. అలా కాకుండా కేవలం ఏపీ ప్రభుత్వం బాధ్యత అని వదిలేస్తే మాత్రం అయిదేళ్ళలో రాజధాని పూర్తి కావడం కష్టమే. దానికి 2014 నుంచి 2019 రాజధాని పేరిట సాగిన ప్రహసనమే సాక్ష్యం అంటున్నారు.

ఇక ఏపీకి వస్తున్న బీజేపీ నేతలు రాజధానిని పూర్తి చేస్తామని పోలవ్రం ప్రాజెక్ట్ కి అవసరం అయిన నిధులు ఇస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని అలాగే ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేరుస్తామని చెబితే కచ్చితంగా కూటమి వైపు జనాల మొగ్గు ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే రాయలసీమ వారికి అమరావతి రాజధాని ఓకే కానీ వారి ప్రాంతానికి ఎంత మేరకు అభివృద్ధి చేశారు ఎంత చేయాలి అన్న దాని మీద సందేహాలు ఉన్నాయి. కర్నూల్ వేదికగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు.

ఆ దిశగా కూటమి స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంది. ఇక అమరావతి రాజధాని అయినా వికేంద్రీకరణ విధానం అవలంబించి విశాఖ కర్నూల్ వంటి ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు పెడతామని అభివృద్ధి అన్ని చోట్లా చేస్తామని కూటమి నుంచి స్పష్టమైన హామీ లభిస్తేనే ప్రజలలో నమ్మకం పెరుగుతుంది. అలా కాకుండా కేవలం నోటి మాటగా హామీలు ఇస్తే మాత్రం ఎన్ని ట్రంప్ కార్డులు బయటకు తీసినా ఆశించిన ప్రయోజనాలు దక్కవనే అంటున్నారు.

Tags:    

Similar News