నిన్న 23, నేడు 11... చంద్రబాబు ర్యాగింగ్ వైరల్!
తాజాగా అమరావతి నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు.. అనంతరం సీఆర్డీయే కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల త్యాగాలు, నిరసన కార్యక్రమాల గురించి ప్రస్థావించారు.
రాజకీయాల్లో మాటకు మాట ఇవ్వడం చాలా ముఖ్యం అని అంటుంటారు. ప్రతీ విమర్శకు సరైన సమయంలో సరైన సమాధానం ఇచ్చి తీరాలని, అది జనాల్లోకి బలంగా వెళ్తుందని అంటుంటారు. పైగా... మాటల్లో ఇచ్చే సమాధానం కన్నా.. చేతల్లో ఇచ్చే సమాధానానికి విలువ ఎక్కువని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా జగన్ కు చేతల్లోనే సమాధానం చెప్పిన బాబు.. తనదైన స్టైల్ లో ర్యాగింగ్ చేశారు.
అవును... 2014 - 19 మధ్యకాలంలో వైసీపీ నుంచి గెలిచిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి తీసుకున్నారు చంద్రబాబు! ఇదే సమయంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలనూ తీసుకున్నారు! అయితే... 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలతో ఘన విజయం సాధించిన సమయంలో టీడీపీకి 23 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో నాడు బాబుని బంతాడేసుకున్నారు వైసీపీ నేతలు, సానుభూతిపరులు!
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ 23 మందిని అనధికరికంగా లాక్కున్నారని.. అందుకే 2019 ఎన్నికల్లో 23 సీట్లే దక్కాయని.. ఇదంతా దేవుడి స్క్రిప్ట్ అని జగన్ పదే పదే చెప్పేవారు. ఇక వైసీపీ నేతల సంగతి సరేసారి... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పుడు కేటాయించిన ఖైదీ నెంబర్ టోటల్ కూడా 23 అంటూ ఎద్దేవా చేసేవారు.
కట్ చేస్తే... 2024 ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ & కోకి భారీ విజయం దక్కింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఈసారి చంద్రబాబుకి టైం వచ్చింది. సరైన సమయం చూసి జగన్ కు ఇచ్చిపడేశారు. అదే దేవుడి స్క్రిప్ట్ పదాన్ని ప్రయోగిస్తూ.. అంకెలతో ఆడుకున్నారు చంద్రబాబు.
తాజాగా అమరావతి నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు.. అనంతరం సీఆర్డీయే కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల త్యాగాలు, నిరసన కార్యక్రమాల గురించి ప్రస్థావించారు. ఇందులో భాగంగా... అమరావతి రైతులు సరిగ్గా 1631 రోజులు నిరసన తెలిపారని.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో తమ పోరాటాన్ని విరమించారని అన్నారు.
ఈ సమయంలోనే అమరావతి రైతులు నిరసన తెలిపిన 1631 రోజులను ప్రస్థావించిన బాబు... 1 + 6 + 3 + 1 = 11.. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ సెటైర్ వేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. ఇప్పుడు బాబుకి టైం వచ్చింది.. జగన్ & కో ఈ ర్యాగింగులకు సిద్ధంగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడే ఇలా ఉందంటే... ఇక అసెంబ్లీలో వేరే లెవెల్లో ఉంటుందేమో అని, ఈ విషయంలో బాబు బాగా ప్రిపేర్ అయ్యే రంగంలోకి దిగుతున్నట్లున్నారని అంటున్నారు.