ఉత్తరాంధ్ర కు చంద్రబాబు న్యాయం చేయలేదా ?
తాజా ఎన్నికలో సైతం మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 32 సీట్లు కూటమికి దక్కాయంటే ఈ రేంజిలో ఉత్తరాంధ్రా అండగా ఉందో అర్ధం అవుతోంది.
చంద్రబాబు మంత్రివర్గం విస్తరణ చూస్తే కొన్ని ప్రాంతాలకు పెద్దగా న్యాయం జరిగినట్లుగా అనిపించదు. 2014 నుంచి 2019 దాకా బాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో జిల్లాకు రెండు మంత్రి పదవులు వంతున అరడజన్ పదవులు ఇచ్చారు. ఈసారి చూస్తే కేవలం నాలుగు మంత్రి పదవులే దక్కాయి.
అందులో చూస్తే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ నుంచి వంగలపూడి అనిత ఉన్నారు. విశాఖలో 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. విశాఖ సిటీకి అసలు ప్రాతినిధ్యం లేదు.
దీంతో ఉత్తరాంధ్రా పట్ల బాబు చిన్న చూపు చూశారా అన్న చర్చ సాగుతోంది. టీడీపీకి దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర అయువు పట్టువా ఉంటూ వస్తోంది. ఎపుడు ఎన్నికలు జరిగినా ఉత్తరాంధ్రా జిల్లాలు సైకిలెక్కేస్తాయి. తాజా ఎన్నికలో సైతం మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 32 సీట్లు కూటమికి దక్కాయంటే ఈ రేంజిలో ఉత్తరాంధ్రా అండగా ఉందో అర్ధం అవుతోంది.
ఇక శ్రీకాకుళం జిల్లా అయితే 1983 నుంచి టీడీపీకి కంచు కోట అనే చెప్పాలి. ఈ జిల్లాలో బీసీ కులాలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా టీడీపీకే మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి. టీడీపీ బీసీ పార్టీగా రాజకీయంగా దీనిని సొమ్ము చేసుకుంది.
ఇక విశాఖ సిటీ అయితే గడచిన మూడు ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీకే పట్టం కట్టారు జనాలు. విశాఖ కాస్మోపాలిటిన్ కల్చర్ టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. 2019లో జగన్ వేవ్ బలంగా వీచినా విశాఖ సిటీలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ పరం అయ్యాయంటేనే అర్ధం చేసుకోవాల్సి ఉంది.
అటువంటి ఉత్తరాంధ్రాకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు కొంత వివక్ష చూపారా అన్న చర్చ వస్తోంది. గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెరో మూడు మంత్రి పదవులు ఇచ్చిన బాబు ఉత్తరాంధ్రాకు మాత్రం నాలుగంటే నాలుగు పదవులే ఇచ్చారు.
మూడు జిల్లాలకు మొత్తం తొమ్మిది పదవులు ఇచ్చిన బాబు అక్కడ కొంత కట్ చేసి విశాఖ శ్రీకాకుళం జిల్లాలకు మరిన్ని మంత్రి పదవులు ఇవ్వవచ్చు కదా అన్న చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్ర లోనే అత్యధిక మెజారిటీలు ఈసారి నమోదు అయ్యాయి. ఏపీలో నంబర్ వన్ మెజారిటీని గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాసరావు సాధించారు.
మరి ఇవన్నీ చూసిన వారు ఉత్తరాంధ్రాలో ఉన్న సామాజిక రాజకీయ ప్రాంతీయ సమతూల్యతను దృష్టిలో పెట్టుకుని బాబు ఎక్కువగా కేబినెట్ బెర్తులు కేటాయిస్తే బాగుండేది అని అంటున్నారు. మరి బాబు మంత్రివర్గం అయితే పూర్తి అయింది. మరో సారి ఏమైనా మార్పు చేర్పులు ఉంటే నెక్స్ట్ టైం బెటర్ లక్ అని అనుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఉత్తరాంధ్రా మాత్రం ఈసారి తక్కువ మంత్రి పదవులతోనే తృప్తి పడాల్సి ఉంటోంది.