విజన్-2047 పై పేర్ని నాని సెటైర్లు
2047 నాటికి మన దేశం ఎంత పురోగతి సాధిస్తుంది అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎలా ఉంటుంది అన్న దానిపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు
విజన్ 2047 అంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డాక్యుమెంట్ ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే. 2047 నాటికి మన దేశం ఎంత పురోగతి సాధిస్తుంది అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎలా ఉంటుంది అన్న దానిపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే విజన్ 2047 నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో ప్రస్తావించారు. అయితే, చంద్రబాబు చేసిన ఈ ప్రజెంటేషన్ వైసిపి నేతలకు నచ్చలేదు. దీంతో, తాజాగా చంద్రబాబు ప్రజెంటేషన్ పై వైసీపీ నేతలు ట్రోలింగ్ కు దిగారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు విజన్ 2020 ఏమైంది? మళ్లీ విజన్ 2047 అని స్పీచ్ లు ఇస్తున్నారు అని నాని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు చెప్తున్నాడని, గతంలో ఇదే విషయంపై ఆందోళన చేసిన వారిపై కాల్పులు చేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. 22 వేల కోట్ల విద్యుత్ కొనుగోలు బకాయిలను ప్రజల నెత్తిన పెట్టిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం వస్తే కరెంటు తీగలు దుస్తులు ఆరేసుకోవడానికి పనికొస్తాయని గతంలో ఈ విజనరీ కామెంట్ చేశాడని నాని పంచులు వేశారు.
వ్యవసాయం దండగ అని విజన్ 2020 లో చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు 63 శాతం రైతులు వ్యవసాయం రంగంపై ఆధారపడి ఉన్నారని, మరి విజన్ 2020 ఫెయిల్ అయినట్టే కదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడు అని కొనియాడిన చంద్రబాబు ఆయనను ఎందుకు వెన్నుపోటు పొడిచారని నిలదీశారు. 14 ఏళ్లలో కుప్పానికి నీళ్లు ఇవ్వని చంద్రబాబు ప్రాజెక్టులు పై ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు మూసివేయించి నారాయణ విద్యా సంస్థలకు లాభాలు చేకూర్చడం చంద్రబాబు విజన్ అని ట్రోల్ చేశారు. పబ్లిసిటీ పథకం మాత్రమే చంద్రబాబుకు తెలుసు అని, స్వాతంత్రం తెచ్చింది కూడా తానే అని ఏదో ఒకరోజు చెబుతారని సెటైర్లు వేశారు.