చంద్రబాబు పవన్ కలసి ఢిల్లీకి...బీజేపీతో తేల్చుడే....!
తగ్గి అయినా కూటమిని గెలిపించేలా చూడాలని పవన్ భావిస్తూంటే సీట్ల దగ్గర పట్టుపడుతోంది బీజేపీ అని ప్రచారం సాగుతోంది.
బీజేపీని టీడీపీ జనసేన కూటమిలోకి తీసుకుని రావాలని పవన్ ఆలోచన. ఈ విషయంలో ఆయన తొంబై శాతం సక్సెస్ అయ్యారు. బీజేపీ పెద్దలు టీడీపీతో కలసి నడవడానికి సుముఖంగా ఉన్నారు. ఇది ఒక విధంగా కూటమికి మంచి పరిణామంగానే చూస్తున్నారు. అయితే పొత్తు సీట్లు మాత్రం తెగడంలేదు. తగ్గి అయినా కూటమిని గెలిపించేలా చూడాలని పవన్ భావిస్తూంటే సీట్ల దగ్గర పట్టుపడుతోంది బీజేపీ అని ప్రచారం సాగుతోంది.
బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి అయినా తమతో కలుపుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నారు. అయితే బీజేపీ కోరినట్లుగా పాతిక అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు బాబు సుముఖంగా లేరు అని అంటున్నారు. కనీసంగా పది గరిష్టంగా పన్నెండు మించి సీట్లు ఇచ్చేందుకు అయితే టీడీపీ రెడీగా లేదు అని అంటున్నారు. అలాగే 2014లో ఇచ్చినట్లుగా నాలుగు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సుముఖంగా ఉంది అని చెబుతున్నారు.
అయితే బీజేపీ ఈసారి పట్టు గట్టిగానే బిగించే అవకాశాలు ఉన్నాయి. తమకు ఏపీలో రాజకీయంగా ప్రాధాన్యత ఉండాలని కమలనాధులు కోరుకుంటున్నారు. అందుకే పాతిక అసెంబ్లీ అని ఆరేడు దాకా ఎంపీ సీట్లు అని కోరుతున్నారు. ఇవన్నీ కూర్చుని చర్చిస్తే కానీ ఒక కొలిక్కి రావు అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడుతారు అని మొదట వినిపించింది. ఇపుడు చూస్తే చంద్రబాబు పవన్ ఇద్దరూ కలసికట్టుగానే ఢిల్లీకి వెళ్తారు అని అంటున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సామావేశాలు ఈ నెల 20 వరకూ సాగుతాయని అంటున్నారు. ఈ సభల తరువాత పవన్ చంద్రబాబు ఢిల్లీ టూర్ ఉంటుందని అంటున్నారు.
ఈ టూర్ లో బీజేపీ జనసేన టీడీపీ నేతలు అంతా కూర్చుని బీజేపీ హై కమాండ్ వద్ద సీట్ల విషయంతో పాటు పొత్తుల విషయం కూడా చర్చించి ఒక కొలిక్కి తీసుకుని వస్తారు అని అంటున్నారు. అయితే ఏపీలోని కొందరు బీజేపీ నేతలు మాత్రం తమకు అధిక సీట్లు ఇవ్వాలనే అంటునారు. విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వారు అయితే సీఎం పదవి బీజేపీ నాయకునికే చెందాలని కూడా కొత్త డిమాండ్లు పెడుతున్నారు.
ఎవరు ఏమనుకున్నా బీజేపీ అధినాయకత్వం ఎలా ఆలోచిస్తుంది అన్నది ఇక్కడ పాయింట్. ఈసారికి చంద్రబాబుకు సోలోగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా మెజారిటీ దక్కకుండా అందరూ కలసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే కమలనాధుల ఆలోచన అని అంటున్నారు. అందువల్ల బీజేపీతో పాటు జనసేనకు కూడా కనీసంగా అరవైకి తగ్గకుండా సీట్లు కోరుతారు అని అంటున్నారు చూడాలి మరి ఢిల్లీ టూర్ తరువాత ఏ పొలిటికల్ డెవలప్మెంట్ ఉంటుందో.