ట్రెండింగ్‌ టాపిక్‌.. చంద్రబాబు టోపీ!

ఆంధ్రప్రదేశ్‌ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-03 07:08 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ రోజుకు మూడు సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 75 ఏళ్ల వయసులోనూ మండు వేసవి, తీవ్ర వడగాడ్పులను కూడా లెక్క చేయకుండా చంద్రబాబు ప్రచారం చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌.. చంద్రబాబును ముసలోడు అని హేళన చేస్తున్నా చంద్రబాబు మాత్రం అలా లేరని అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ జగన్‌ కు గట్టి కౌంటర్‌ ఇస్తోంది. మండు వేసవిలోనూ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు ముసలోడో లేక కేవలం సాయంత్రం పూట మాత్రమే సభలు నిర్వహిస్తున్న జగన్‌ ముసలోడో ప్రజలకు తెలుసని సెటైర్లు వేస్తోంది.

ప్రస్తుతం వేసవి తాపం పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ లో కొన్ని ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వయసు రీత్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా ప్రచారానికి పది రోజులే గడువే ఉన్న నేపథ్యంలో రాష్ట్రమంతా ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన సభల్లో ఒక ప్రత్యేక టోపీని పెట్టుకొస్తుండటంపై ఆసక్తి నెలకొంది.

నిన్న మొన్నటి వరకు చంద్రబాబు తలపై కనిపించని ఆ టోపీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. చంద్రబాబు ఎక్కడకు వెళ్తున్నా, ఏ ప్రాంతంలో సభలు నిర్వహిస్తున్నా ఆ టోపీ ఆయన తలపై దర్శనమిస్తోంది. దీంతో ప్రజలు కూడా ఆ టోపీ ఏంటని ఆరా తీస్తున్నారు.

కాగా చంద్రబాబు ధరిస్తున్న టోపీ చల్లదనాన్ని అందిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతల బారి నుంచి తలను కాపాడుకోవడానికి ఈ కూలింగ్‌ టోపీ ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఈ కూలింగ్‌ టోపీలను కాశ్మీర్‌ లో తయారుచేస్తారని చెబుతున్నారు. అక్కడ మాంసం కోసం కాకుండా కొన్ని గొర్రెలను నాణ్యమైన ఊలు కోసమే పెంచుతారని అంటున్నారు. అలాంటి గొర్రెల నుంచి తీసిన నాణ్యమైన ఊలు నుంచి ఈ కూలింగ్‌ టోపీలను తయారు చేస్తారని పేర్కొంటున్నారు.

ఎంత వేసవి తాపం ఉన్నప్పటికి ఆ ఎండ నుంచి తలకు ఈ కూలింగ్‌ టోపీలు రక్షణనిస్తాయని చెబుతున్నారు. కాగా ఈ కూలింగ్‌ టోపీ విలువ ఏకంగా 8 వేల రూపాయలని అంటున్నారు. అయితే ఈ టోపీలకున్న ప్రత్యేకతలరీత్యా ఈ ధర పెద్ద ఎక్కువేమీ కాదని తక్కువేనని చెబుతున్నారు.

Tags:    

Similar News