చంద్రయాన్ 3: చివరి 12 సెకన్లు ఎంత టెన్షన్ పడ్డారంటే?

ధూళి వల్ల దిగే ప్రదేశం సరిగా గుర్తించలేనట్లుగా ఉండటం ఒక సమస్య. ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా..

Update: 2023-08-24 05:10 GMT

రోజుల తరబడి ఎదురుచూసిన నిరీక్షణ అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వటమే కాదు.. ఒక హాలీవుడ్ మూవీ బడ్జెట్ కు కేవలం సగం ఖర్చుతో ప్రపంచంలో మరే దేశం చేయలేని టాస్కును చేధించారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రుడిలోని సౌత్ పార్టును ముద్దాడిన వైనంతో యావత్ దేశం పులకరించిపోయింది. అయితే.. ఈ అద్భుతమైన విజయానికి కొన్ని సెకన్ల ముందు ఇస్రో శాస్త్రవేత్తలు అనుభవించిన టెన్షన్ అంతా ఇంతా కాదు. సెకన్ల వ్యవధిలో జరిగే తేడాలు.. ఊహించని పరిణామాలు మొత్తం మిషన్ ను నాశనం చేసే అవకాశం ఉన్నప్పటికి.. అందుకు భిన్నంగా సవాళ్లను ఎదుర్కొంటూ సక్సెస్ అయిన చంద్రయాన్ 3కు కొన్నిసెకన్ల ముందు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే.

ముందుగా వేసుకున్న అంచనాలకు భిన్నంగా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కు ముందు చంద్రుడి మీద పరిణామాలు ఉండటంతో చివరి పన్నెండు సెకన్లు ఇస్రో శాస్త్రవేత్తలు అనుభవించిన టెన్షన్ అంతా ఇంతా కాదు. చంద్రుడి మీద ల్యాండింగ్ ప్రక్రియ సాఫీగా సాగటానికి ఒకేసమయంలో 879 మంది శాస్త్రవేత్తలు పని చేశారు. ఈ క్రమంలో ఏ ముగ్గురు తప్పు చేసినా.. ఫలితం మరోలా ఉంటుంది. దీనికి కారణం.. ఫ్రీ ప్రోగ్రాంలో అంచనా వేసినట్లుగా చంద్రుడి మీద వాతావరణం లేకపోవటమే.

ధూళి వల్ల దిగే ప్రదేశం సరిగా గుర్తించలేనట్లుగా ఉండటం ఒక సమస్య. ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా.. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తితో ల్యాండర్ ను లాగేస్తే.. మొత్తం ప్రయోగానికే మోసం. అందుకే వందలాది ప్రశ్నలకు 879 మంది శాస్త్రవేత్తలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఆఖరి అంకానికి ఎంతో ఆసక్తిగా.. అంతకు మించిన ఉద్వేగంతో ఎదురుచూశారు. చంద్రయాన్3 ల్యాండింగ్ సమయంలో కేవలం 0.3 శాతం పొరపాటు జరిగినా.. మొత్తం ప్రయోగమే ఫెయిల్ అయ్యే పరిస్థితి. అలాంటి సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రపంచమే అబ్బురపడేలా ఘన విజయాన్ని సాధించారు మన ఇస్రో శాస్త్రవేత్తలు.

చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు విజయవంతంగా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ ను అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ అద్భుత విజయం ఊరికే రాలేదని.. దానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్న విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. చంద్రుడి ఉపరితలం మీద వేగంగా దిగే ల్యాండర్ ను సమయానికి అనుగుణంగా నియంత్రించటం ఒక పెద్ద సమస్య. కారణం.. ల్యాండింగ్ సమయంలో థ్రస్టర్లు మండటంతో దాని నుంచి వెలువడే ఒత్తిడి కారణంగా ఏర్పడే ధూళి శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.

అదే సమయంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ.. పైకి ఎగిసిన దుమ్ములోనే నిర్ణీత ప్రదేశాన్ని గుర్తిస్తూ ల్యాండర్ ను వీలైనంత నెమ్మదిగా దింపాలి. ఈ సమయంలో ప్రీ ప్రోగ్రాం సూచనల్లో భాగంగా ల్యాండర్ సమస్యల్ని ఎదుర్కొన్నా.. భూమి నుంచి ఇచ్చే సిగ్నల్స్ లో ఏ మాత్రం ఆలస్యం జరిగినా.. ల్యాండర్ కూలే ప్రమాదం పొంచి ఉంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయంలో ముందుగా అంచనా వేసుకున్న సమస్యలు ఎదురుకాకున్నా.. కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యాయి.

అంతే.. అప్పటికే సిద్ధంగా ఉన్న శాస్త్రవేత్తలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కారాల్ని అందించారు. ఇదంతా కేవలం12 సెకన్ల వ్యవధిలో పూర్తి అయ్యింది. ల్యాండర్ ల్యాండ్ అయ్యే వేళలో చంద్రుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున లేచిన ధూళితో.. ల్యాండర్ ఎక్కడ దిగుతుందో కెమేరాలకు స్పష్టంగా కనిపించలేదు.

దీంతో.. ఇస్రో పరీక్ష హాల్లో ఏం జరుగుతుందో అర్తం కాలేదు. ఉపరితలం నుంచి ల్యాండర్ ఎంత ఎత్తులో ఉంది? స్పీడ్ ఎంత తగ్గింది? లాంటి లెక్కల్ని పక్కగా వేసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు సేఫ్ గా ల్యాండ్ చేయించటంలో సక్సెస్ అయ్యారు. దీంతో.. యావత్ భారతం పులకరించగా.. ప్రపంచంలో అబ్బురంగా మన దేశం వైపు చేసింది. అంతరిక్ష పరీక్షల్లో ఇప్పటివరకు ఎవరూ సాధించలేని సక్సెస్ ను ఇస్రో శాస్త్రవేత్తల పుణ్యమా అని సొంతం చేసుకుంది. జయహో ఇస్రో సైంటిస్టులు.. జయోహో ఇండియా.

Tags:    

Similar News