చంద్రయాన్ - 3... శత్రువు సైతం పొగిడిన వేళ.!
అనుకూలులూ, సానుకూలులూ, సన్నిహితులు, స్నేహితులూ.. పొగిడినా, అభినందించినా ఆ కిక్కు ఒక లెక్క
అనుకూలులూ, సానుకూలులూ, సన్నిహితులు, స్నేహితులూ.. పొగిడినా, అభినందించినా ఆ కిక్కు ఒక లెక్క. అయితే... శత్రువు అభినందిస్తే, శత్రువు పనిగట్టుకొని కీర్తిస్తే ఆ కిక్కే వేరు.. దాని లెక్కే వేరు! ప్రస్తుతం చంద్రయాన్ - 3 సక్సెస్ అనంతరం భారత దేశం ప్రపంచ దేశాలలో అలానే కీర్తించబడుతుంది.
అవును... ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశానికి సాధ్యంకాని విషయాన్ని సుసాధ్యం చేసి చూపించిన భారత్ ను ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. అక్కడి పత్రికల్లో చంద్రయాన్ - 3 బ్యానర్ ఐటం అయ్యింది. వాటిలో మిత్రదేశాలతో పాటు శత్రుదేశాలూ ఉండటం గమనార్హం.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తొలిదేశంగా భారత్ నిలిచిపోవడాన్ని కొనియాడుతూ అమెరికా సహా అనేక దేశాల ప్రధాన పత్రికలన్నీ పతాక శీర్షికలతో కథనాలు వెలువరించాయి. ఇందులో భాగంగా... "వాషింగ్టన్ పోస్ట్" రెండు కథనాలను ప్రచురించింది. ఇది భారత్ కు చరిత్రాత్మక విజయమని పేర్కొంది.
ఇదే క్రమంలో... "చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ చరిత్రాత్మక ల్యాండింగ్" అంటూ బీబీసీ.. "21వ శతాబ్దంలో చైనా తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టిన రెండో దేశంగా భారత్ అవతరించింది" అని సి.ఎన్.ఎన్. తమ కథనాల్లో తెలిపాయి.
ఇదే క్రమంలో... భారతదేశ శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తంచేస్తూ గతంలో మంగళ్ యాన్ మిషన్ ను ఉద్దేశించి వ్యంగ్య కార్టూన్ ప్రచురించిన "న్యూయార్క్ టైమ్స్" సైతం "భారత్ కు ఇది గొప్ప విజయం" అంటూ కితాబు ఇచ్చింది. ఇదే సమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మీడియా సైతం భారత్ ను కీర్తించింది.
అవును... ఇస్రో విజయాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కొనియాడారు. ఇదే సమయంలో చంద్రయాన్ - 3 సక్సెస్ పై పాకిస్థాన్ మీడియా సైతం భారత్ విజయంపై విస్తృతంగా కవరేజి ఇచ్చాయి. ఇదే క్రమంలో... ప్రధానిని, ఇస్రోను, భారత ప్రజల్ని అభినందిస్తూ శ్రీలంక అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేశారు.
అనంతరం... అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం పోటీపడే దేశాల జాబితాలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపే పరిణామంగా చంద్రయాన్ నిలిచిపోతుందని బీబీసీలో సైన్స్ ఎడిటర్ రెబెక్కా మొరెల్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా... శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్షాన్ని వాడుకోవడంలో భారత్ పెద్ద విజయం సాధించిందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. అమెరికా సహా ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను ఇస్రో దింపిందని.. ఇది మరింత మధురమైన విజయం అని.."ది గార్డియన్" పత్రిక సైన్స్ ఎడిటర్ ఇయాన్ శాంప్లే వ్యాఖ్యానించారు. ఈ మిషన్లో తామూ భాగస్వాములు కావడం గర్వకారణమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ అన్నారు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన వ్యక్తులు, శక్తివంతమైన దేశాల్లోన్ని ప్రధాన మీడియా సంస్థలు భారత దేశ విజయాన్ని కీర్తించాయి!