చంద్రుడి మీద ఆ ప్లేస్ కు పేరు పెట్టేసిన మోడీ
ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన అభిమానులకు అభివాదం చేసిన మోడీ.. అనంతరం పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్లి శాస్త్రవేత్తల్ని అభినందించారు
చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న ఇస్రో శాస్త్రవేత్తల్ని స్వయంగా కలిసి అభినందించటానికి బెంగళూరుకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయ్యే రోజు దక్షిణాఫ్రియాలో ఉన్న ఆయన..తన ఫారిన్ టూర్ ముగించుకున్న ఆయన సౌతాఫ్రికా నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన అభిమానులకు అభివాదం చేసిన మోడీ.. అనంతరం పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్లి శాస్త్రవేత్తల్ని అభినందించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రుడి దక్షిణ భాగంలో విజయవంతంగా ల్యాండ్ అయిన ల్యాండర్ ప్రదేశానికి సరికొత్త పేరును పెట్టారు. ఇకపై ఆ ప్రదేశాన్ని ''శివశక్తి''గా పెట్టారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నిర్వహించిన తీరును ప్రధాని మోడీకి ఇస్రో ఛైర్మన్ సోమనాత్ వివరించారు. అనంతరం శాస్త్రవేత్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు.
చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వేళలో తాను దక్షిణాఫ్రికాలో ఉన్నానని.. ఆ సందర్భంగా తన మనసంతా చంద్రయాన్ 3 విజయం మీదనే ఉందన్నారు. ''ఈ విజయం పట్ల శాస్త్రవేత్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదో అసాధారణ విజయం. చంద్రుడిపై భారత్ అడుగు పెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాం. ఇప్పుడు భారత్ చంద్రుడి మీద ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం.
ప్రపంచంలో ఎన్నో సమస్యలకు భారత్ పరిష్కారం చూపగలదని నిరూపించాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది. చంద్రయాన్ 3 దిగిన ప్రాంతానికి శివశక్తి అన్న పేరును పెట్టుకుందాం. ఇప్పుడు ప్రతి ఇంటి మీదే కాదు.. చంద్రుడి మీదా త్రివర్ణ పతాకం ఎగురుతోంది. మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటాం. ఇస్రో విజయం ఎన్నో దేశాలకు స్పూర్తినిస్తుంది'' అని వ్యాఖ్యానించారు.
మంగళయాన్.. చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామన్న ప్రధాని మోడీ.. ఈ విజయాల స్ఫూర్తితో గగన్ యాన్ కు సిద్ధమవుదామన్నారు. అంతేకాదు.. ఆగస్టు 23ను ఇకపై ''జాతీయ అంతరిక్ష దినోత్సవం''గా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఫలితాల్ని అందుకోవాలని.. వ్యవసాయం.. విద్య రంగాల్లో ఈ టెక్నాలజీ సాయం చేయాలన్న ఆయన.. తుఫానులను సరిగా అంచనా వేయటంలో మరింత నైపుణ్యాన్ని సాధించాలన్నారు. వాతావరణ మార్పుల గురించి మరింత కచ్ఛితంగా తెలుసుకోవాలన్న మోడీ మాటలు.. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక ప్రయోగాలకు ఇస్రో వేదికగా మారుతుందని చెప్పక తప్పదు.