చంద్రయాన్‌ – 3లో కీలక మలుపు!

ఆగస్టు 17న చంద్రయాన్‌–3లోని ల్యాండర్‌–రోవర్‌ మాడ్యూల్‌.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి వేరవుతుంది.

Update: 2023-08-02 12:47 GMT

వందల కోట్ల మంది భారతీయుల ఆశలను సాకారం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక మలుపు చోటు చేసుకుంది. జూలై 14న ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టగా ఇప్పటివరకు వ్యోమనౌక విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రయోగించిన నాటి నుంచి జూలై 31 వరకు అంటే 17 రోజులపాటు భూమి చుట్టూ చంద్రయాన్‌–3 వ్యోమ నౌక భూప్రదిక్షణలు చేసింది.

చంద్రుడిపైన ల్యాండర్, రోవర్‌ లను దింపడమే లక్ష్యంగా ఇస్రో జులై 14న ఎల్‌వీఎం3 ఎం–4 రాకెట్‌ సాయంతో చంద్రయాన్‌–3ను భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నాటి నుంచి శాస్త్రవేత్తలు.. వ్యోమనౌకలోని ఇంజిన్‌ను నిర్దిష్ట సమయంలో మండించడం ద్వారా దశలవారీగా దీని కక్ష్యను పెంచుతూ వస్తున్నారు. ఈ విధానంలో వ్యోమనౌక భూగురుత్వాకర్షణ శక్తిని యుక్తిగా ఉపయోగించుకుంటూ వడిసెలా (స్లింగ్‌ షాట్‌) ముందుకు వెళ్తోంది.

జూలై 14 నుంచి జూలై 31 వరకు 17 రోజుల పాటు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఈ వ్యోమనౌక.. ఇప్పుడు కీలకమైన దశలోకి ప్రవేశించింది. భూ కక్ష్యను దాటింది. చంద్రుడి దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఆగస్టు 5న చంద్రయాన్‌ వ్యోమ నౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు కీలక కసరత్తు చేపట్టారు. భూమికి చేరువగా ఉండే బిందువు (పెరిజీ)లో ఉన్న సమయంలో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి ఆదేశాలు పంపి వ్యోమనౌకలోని ఇంజిన్‌ను 20 నిమిషాలకుపైగా మండించారు. ఫలితంగా ఈ వ్యోమనౌక భూకక్ష్యను వీడి, చందమామను చేరుకునే మార్గం (లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ)లోకి ప్రవేశించింది.

ఆగస్టు 5న చంద్రుడి చంద్రుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. ఆ దశలో వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్‌ను మరోసారి మండించి, వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తారు. దీంతో చంద్రయాన్‌–3లోని ‘మూన్‌ సెంట్రిక్‌ దశ’ మొదలవుతుంది. ఆ తర్వాత జాబిల్లి చుట్టూ చంద్రయాన్‌ వ్యోమనౌక ప్రదిక్షణలు చేస్తుంది.

ఆ దశలో వ్యోమనౌక ఇంజిన్‌ను దశలవారీగా మండించి, దాని కక్ష్యను శాస్త్రవేత్తలు తగ్గిస్తారు. క్రమంగా చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకొస్తారు. ఈ విన్యాసాన్ని అత్యంత ఒడుపుగా నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

ఆగస్టు 17న చంద్రయాన్‌–3లోని ల్యాండర్‌–రోవర్‌ మాడ్యూల్‌.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి వేరవుతుంది. ఇక ఆగస్టు 23న చిట్టచివరి, అత్యంత కీలకమైన ఘట్టానికి తెరలేస్తుంది. ఆ రోజున ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌–రోవర్‌ మాడ్యూల్‌ కు ఆదేశాలు పంపడం ద్వారా దాన్ని చందమామపై దించుతారు. క్రమపద్ధతిలో వేగాన్ని నియంత్రించుకుంటూ ఆగస్టు 23 సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో ల్యాండర్‌ దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి, చందమామ ఉపరితలంపై తిరగడం ప్రారంభిస్తుందవి. ల్యాండర్, రోవర్‌ కలిసి 14 రోజులపాటు జాబిల్లిపై పరిశోధనలు సాగిస్తాయి.

Tags:    

Similar News