చంద్రయాన్ 3 సక్సెస్ సరే.. ల్యాండర్ బరువు ఎంత? రోవర్ వెయిట్ మాటేంటి?
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా భారతీయులంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన క్షణాల్ని అనుభవించారు
చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయ్యింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా భారతీయులంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన క్షణాల్ని అనుభవించారు. ఒక్క దేశంలోనే కాదు.. విదేశాల్లో ఉన్న భారతీయులంతా తమ దేశ ఘనతను కళ్లారా చూసేందుకు వీలుగా సిద్ధమయ్యారు. చంద్రయాన్ 3 సక్సెస్ వేళ.. ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక అంశాల్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. అదే సమయంలో.. ఈ ప్రయోగం ఎంత కఠినమైనదన్న విషయం అర్థమవుతుంది.
చంద్రుడిపై ల్యాండ్ అయ్యిన ల్యాండర్.. అందులోని రోవర్ (ఇదే.. చంద్రుడి మీద మట్టిని.. శిలల్ని పరీక్షించేది) బరువులు ఎంత? అన్నది తెలిస్తే.. ఈ ప్రయోగం విలువ ఇట్టే అర్థమవుతుంది. జులై 14న నింగిలోకి ఎగిసిన చంద్రయాన్ 3ను ఆకాశంలోకి తీసుకెళ్లిన రాకెట్ ఎల్వీ ఎం3-ఎం4. ఈ ప్రయోగం కోసం వెచ్చించిన మొత్తం రూ.615 కోట్లు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2145 కేజీలు. ఇందులో ల్యాండర్ బరువు 1749.86 కేజీలు అయితే.. అనుకున్నవిధంగా చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాక.. ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ బరువు 26 కేజీలు.
ప్రొపల్షన్ మాడ్యూల్ లో ఉన్న ఇంధనం బరువు 1696 కేజీలు. రోవర్ లో ఉండే పవర్ 50 వాట్స్. ఈ మొత్తాన్ని తనతో తీసుకెళ్లిన రాకెట్ మొత్తం బరువు 642 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు) ఎల్వీ ఎం3-ఎం4 రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు ఉండగా.. రోవర్ చక్రాలు ఆరు. జులై 14న నింగిలోకి ఎగిసి.. 3.5లక్షల కిలోమీటర్ల ఆవల ఉన్న చంద్రుడ్ని ఆగస్టు 23న కాలు మోపింది విక్రమ్ ల్యాండర్.