చాగంటి వారికి వద్దన్నా పదవులు
తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండవ నామినేటెడ్ పదవుల జాబితాలో అన్నింటి కన్నా ఆకర్షించే విషయంగా చాగంటి వారిని ఒక కీలకమైన పదవి కోసం ఎంపిక చేయడం కనిపించింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తగా విరాజిల్లుతున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. ఆయన విద్వత్తు ఎన్నతగినది, ఆయన ప్రసంగాలు పండిత పామరులను సమానంగా రంజింపచేస్తాయి. ఆయన తనకు ఉన్న విజ్ఞాన సంపదను జనం కోసం అందించేందుకు దశాబ్దాలుగా చేస్తున్న కృషి నిరుపమానం.
చాగంటి వారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవ దేనినో ఆశించి కాదు. ఆయన ఎన్నో సార్లు చెప్పుకున్నారు కూడా. ఆయన చాలా నిబద్ధత కలిగిన వారుగా చెప్పుకుంటారు. ఆయన లాంటి ప్రవచనకర్త ఈ రోజుల్లో ఉండడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం గా చెప్పాలి.
పురాణాలు ఉపనిషత్తుల సారాన్ని ఆయన ఆమూలాగ్రం గ్రహించి జనాలకు సరళంగా వివరించడం ద్వారా వారిని ధన్యత కల్పిస్తున్నారు. చాగంటి వారిది ఆధ్యాత్మిక ధ్యాస తప్ప మరేమీ ఆయనకు పట్టదని కూడా చెప్పుకోవాలి.
అయితే ఆయనకు పదవులు మాత్రం వరించి వస్తూనే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా నియమించారు. అయితే ఆయన ఈ పదవి వద్దు అని సున్నితంగానే తిరస్కరించారు.
దానికి కారణం కూడా చెప్పారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారే తనకు ఊపిరి సర్వస్వం అని చెప్పారు. టీటీడీ కార్యక్రమాలలో తాను ఎపుడూ ముందు ఉంటానని ఆయన చెప్పారు. అందువల్ల తనకు ప్రత్యేకించి ఏ పదవులూ అవసరం లేదని ఆయన అన్నారు.
ఇక కట్ చేస్తే ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో చాగంటి వారికి మంచి పదవి దక్కింది. తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండవ నామినేటెడ్ పదవుల జాబితాలో అన్నింటి కన్నా ఆకర్షించే విషయంగా చాగంటి వారిని ఒక కీలకమైన పదవి కోసం ఎంపిక చేయడం కనిపించింది.
స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా చాగంటి వారిని నియమించారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి అత్యంత కీలకమైనది. చాగంటి వారికి తగినది కూడా. ఆయన బోధించే బోధనలు నైతిక నిష్ట వంటివి ఈ తరానికి పాఠాలుగా చేరాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆయనను కోరి మరీ ఈ పదవికి ఎంపిక చేసింది.
అయితే నాడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన పదవిని సున్నితంగా తిరస్కరించిన చాగంటి వారు ఇపుడు ఈ పదవిని స్వీకరిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. నిజం చెప్పాలంటే ఆయనకు పదవుల మీద ఆసక్తి లేదు అనే అంటారు. పైగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన పదవిని వద్దు అని ఇపుడు ప్రభుత్వం పదవిని తీసుకుంటే రాజకీయంగా కూడా ఏమైనా విమర్శలు వస్తాయా అన్న చర్చ ఉంది.
దీంతో చాగంటి వారికి పదవి విషయంలో అయితే ఒక చర్చ సాగుతూనే ఉంది. ఆయన అంగీకరిస్తే అయిదు కోట్ల మంది ప్రజలూ సంతోషిస్తారు. అయితే ఆయన నిర్ణయం ఏమిటి అన్నది ఇపుడు ఆసక్తిని పెంచుతోంది. మరో వైపు చూస్తే ఆయనను సంప్రదించిన మీదటనే ఈ పదవికి ఎంపిక చేసి ఉంటారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా చాగంటి వారికి వద్దన్నా పదవులు వస్తున్నాయి. అది ఆయన కోసం కాదు, ప్రజల కోసం అన్న సంగతి ఎవరికైనా అర్ధం అయితే పదవుల కోసం వెంపర్లాడడం కంటే తమ స్వీయ నిబద్ధతను పదును పెట్టుకుంటారు.