కిరణ్ రాయల్ ఇష్యూ.. తిరుపతి లక్ష్మికి బెయిల్!

దీంతో తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ వివాదం మరో మలుపు తిరిగింది.

Update: 2025-02-12 15:27 GMT

చెక్ బౌన్స్ కేసులో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసిన తిరుపతికి చెందిన లక్ష్మికి బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం తిరుపతిలో ఆమెను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. అయితే లక్ష్మి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి రూ.50 వేల పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలు చూపించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేశారు. దీంతో తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ వివాదం మరో మలుపు తిరిగింది.

జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని తిరుపతికి చెందిన లక్ష్మి వారం రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని బాధితురాలు సెల్ఫీ వీడియో విడుదలచేశారు. అంతేకాకుండా ఆయనతో ఆమె సన్నిహితంగా ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కిరణ్ రాయల్ మెడలో ఆమె తన బంగారం చెయిన్ వేసిన వీడియోను ప్రతిపక్షాలు తీవ్రంగా ట్రోల్ చేశాయి. దీంతో కిరణ్ రాయల్ కూడా బాధితురాలు లక్ష్మిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మోసకారి అంటూ ఆరోపించడమే కాకుండా, లక్ష్మిపై దేశవ్యాప్తంగా కేసులు పెండింగులో ఉన్నాయని వెల్లడించారు.

దీంతో కిరణ్ రాయల్, లక్ష్మి మధ్య వివాదం రాష్ట్రవ్యాప్తంగా హీట్ పెంచింది. కిరణ్ రాయల్ వీడియోలు వైరల్ అవడంతో జనసేన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనను ఆదేశించింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలంటూ పార్టీ కమిటీని ఆదేశించింది. జనసేన నాయకత్వం జోక్యం చేసుకున్న తర్వాత ఈ వివాదం మరో మలుపు తిరిగింది. పార్టీ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టిన మరునాడే.. తిరుపతిలో రాజస్థాన్ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసిన లక్ష్మి ఆ తర్వాత నేరుగా మీడియా ముందుకు వచ్చి కిరణ్ రాయల్ ను టార్గెట్ చేశారు.

అలా ఆమె తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే రాజస్థాన్ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై తరలించారు. అయితే కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో కథ సుఖాంతమైంది. కానీ, ఆమె తిరిగి తిరుపతికి వచ్చి కిరణ్ రాయల్ పై పోరాటం చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. తనకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. లక్ష్మి అరెస్టుకు ముందు ఆమె కోసం జైపూర్ పోలీసులు వస్తున్నారంటూ కిరణ్ రాయల్ ముందే ప్రకటించడంతో అరెస్టు వెనుక ఆయన హస్తం ఉందని లక్ష్మి బంధువులు అనుమానిస్తున్నారు. మరోవైపు పెండింగు కేసులో బెయిల్ లభించడంతో లక్ష్మికి కాస్త ఉపశమనం దక్కినట్లైంది. ఇప్పుడు ఆమె లక్ష్యమంతా కిరణ్ రాయల్ అని చెబుతున్నారు. అయితే ఒంటరి మహిళ అయిన ఆమె అంతలా పోరాటడం వెనుక కిరణ్ రాయల్ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని జనసేన స్థానిక నేతలు అనుమానిస్తున్నారు.

బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన లక్ష్మి తిరుపతిలో అడుగు పెట్టిన తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వివాదాన్ని ముగించి కిరణ్ రాయల్ తో రాజీకి ప్రయత్నిస్తుందా? లేక తెగేదాకా లాగుతుందా? చూడాల్సివుంది. అయితే లక్ష్మికి తాను బకాయి లేనంటూ కిరణ్ రాయల్ చెబుతున్నారు. తన వాదనకు మద్దతుగా కొన్ని వీడియోలు చూపుతున్నారు. దీంతో ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు పడుతుంది? ఎలా ముగుస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News