అర్టీసీ భూములను టార్గెట్ చేసిన వైసీపీ నేత చెవిరెడ్డి ?

ఈ ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ని నిర్మించడానికి ప్రైవేట్ మాల్స్ తో ఒప్పందం కూడా ఆయన కుదుర్చుకున్నారని అంటున్నారు

Update: 2024-06-24 15:05 GMT

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి ఏపీలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఆయా ఖాళీ స్థలాలను భవిష్యత్తు అవసరాలకు సంస్థ అట్టే బెట్టుకుంది. అయితే ఆర్టీసీ ఖాళీ భూముల మీద వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కన్ను పడింది అని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆయన ఏపీలో ఉన్న ఆర్టీసీ స్థాలను టార్గెట్ చేసి తన కుమారుడు మోహిత్ రెడ్డి పేరుతో ఏకంగా 17 ఆర్టీసీ ఖాళీ స్థలాలను దక్కించుకున్నారు అని అంటున్నారు.

ఈ ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ని నిర్మించడానికి ప్రైవేట్ మాల్స్ తో ఒప్పందం కూడా ఆయన కుదుర్చుకున్నారని అంటున్నారు. అలా తాను ఒక వ్యూహం ప్రకారమే ఆర్టీసీ భూములను స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అలా వైసీపీ అధికారంలో ఉన్న టైం లో తనకు కావాల్సిన విధంగా కధను నడిపారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అంతే కాదు ఆర్టీసీ స్థలాలలో ఏవైనా టెండర్లు పిలిచినా అవన్నీ మొక్కుబడి వ్యవహారంగానే సాగాయని ఎవరైనా తనకన్నాఎక్కువ ధరకు కోట్ చేసినా వారిని బెదిరించి ఒత్తిడులు పెట్టి తప్పుకునేలా చేశారు అని కూడా అంటున్నారు. ఇలా ఆర్టీసీ అధికారులను సైతం తన మాట వినేలా చేసుకుని చెవిరెడ్డి బాగానే ఆర్టీసీ స్థలాలు తన వైపు తిప్పుకున్నారని అంటున్నారు.

ఇలా చేజిక్కించుకున్న ఆర్టీసీ స్థలాలలో ఒకటైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్టాండ్‌ ఆవరణలో ఉన్న స్థలంలో తాజాగా పనులు చేస్తుండగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ ఆదివారం అడ్డుకోవడంతో మొత్తం వ్యవహారం బయటపడింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలోని ఒక ప్రముఖ ప్రైవేట్ మాల్ కి ఏకంగా 70 కీలకమైన ప్రాంతాలలో అవసరమైన స్థలాలను లీజు పద్ధతిని ఇచ్చేందుకు చెవిరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని అంటున్నారు.

ఈ విధంగా ఆర్టీసీకి ఆదాయం అభివృద్ధి అని చెప్పి ఆర్టీసీ అధికారుల లీజు కోసం టెండర్లకు పిలిపించి నట్లుగా చెబుతున్నారు. అలా ఆర్టీసీ స్థలాలను లీజు విధానంలో స్వాధీనం చేసుకున్న చెవిరెడ్డి ఎన్నికలకు నెలముందే ఆర్టీసీ ద్వారా ఆస్తుల లీజుకు సంబంధించి ప్రకటన చేసేలా చర్యలు తీసుకున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఆర్టీసీ స్థలానికి మంచి డిమాండ్ ఉంది అని ంటున్నారు. ఇక్కడ స్థలం చూస్తే రూ.20 కోట్ల విలువ చేసేదిగా ఉంది. సుమారు 40 సెంట్ల స్థలాన్ని పదిహేనేళ్ల పాటు నెలకు రూ.1.80 లక్షలు చెల్లించేలా అధికారులు టెండర్లు ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే ఈ టెండర్లలో పాల్గొనడానికి చెవిరెడ్డి తన కుమారుడు మోహిత్‌రెడ్డి పేరుతో టెండర్‌ దాఖలు చేశారని అంటున్నారు.

కానీ చెవిరెడ్డి కంటే కూడా మరో ఇద్దరు ఎక్కువ ధరకే కోట్ చేశారని తెలుస్తోంది. ఇలా టెండర్లు దాఖలు చేసిన వారిలో ఒక మహిళ, ప్రైవేటు డాక్టర్‌ ఉన్నా సరే వారిద్దరినీ ఒత్తిడి పెట్టి తప్పుకొనేలా చేసినట్లుగా కూడా చెవిరెడ్డి మీద ఆరోపణలున్నాయని అంటున్నారు.

ఇక ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏంటి అంటే నెల్లూరులో ఆర్టీసీ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందాయని అంటున్నారు. అలా చేసిన మీదటనే ఈ టెండర్లలో తక్కువ కోట్ చేసి మూడో వ్యక్తిగా ఉన్న మోహిత్‌రెడ్డికి టెండర్‌ దక్కిందని అంటున్నారు.

ఇలా టెండర్లు తక్కువకు కోట్ చేసి విలువైన ఆర్టీసీ భూములను తీసుకుంటామంటే ఒప్పుకోమని టీడీపీ అంటోంది. ఏకంగా ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు అని అంటున్నారు. ఆఖరుకు ఆర్టీసీ ఆస్తులపైనా కన్నేయడం దారుణమమని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ విమర్శించారు.

కేవలం ఒంగోలు భూములు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆర్టీసీ డిపోల పరిధిలో లీజు పద్ధతిన కేటాయించిన ఆస్తులను కాపాడుకుంటామని తెలిపారు. అంతే ఇప్పటివరకు పిలిచిన టెండర్లు రద్దు చేయిస్తామన్నారు. మొత్తం మీద కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అవినీతి మీద విచారణ చేయించేందుకు సిద్ధంగా ఉంటే వారికి కాలికి వేలికి తీగలు అన్నీ ఒక్కోటిగా వచ్చి దొరకడం విశేషం.

Tags:    

Similar News