నోరు తెరిస్తే ఇవ్వలేదంటారు? ఇచ్చినోళ్లకు మనమేం చేశాం కేసీఆర్?

అంతేనా.. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ అనే మాటకు మరో ముచ్చటే లేదు

Update: 2023-11-18 04:18 GMT

నోరు తెరిస్తే చాటు.. వాళ్లు ఇది ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదు. అసలేమీ ఇవ్వలేదంటూ నిత్యం ఎదుటోళ్ల మీద పడి ఏడ్చేసే వైనం గులాబీ బాస్ కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఉద్యమనేతగా ఉన్న వేళలో ఆయన మాట్లాడే మాటలకు అంతో ఇంతో అర్థం ఉంటుంది. పదేళ్లు అధికారంలో ఉండి.. ఆయన పాలనా తీరు ఎలా ఉంటుందన్న దానిపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత.. ప్రజలందరికి అన్నీ తెలిసిన తర్వాత కూడా తన పాత సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయటంలో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న చిన్న విషయాన్ని ఎలా మిస్ అవుతారన్నది ప్రశ్నగా మారుతుంది.

నోరు తెరిస్తే చాలు.. తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ.. వాళ్లు ఇది ఇవ్వలేదు. వీళ్లు ఇది చేయలేదు.. అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద పడిపోయే ఆయన.. అక్కడితో ఆగకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీదా విరుచుకుపడతారు. మొత్తంగా చూస్తే.. తమ చేతి నుంచి అధికారాన్ని తీసుకోవాలని ప్రయత్నించే ఏ ఒక్కరిని విడిచిపెట్టని ఆయన.. చిన్న లాజిక్ మిస్ అవుతారు. తెలంగాణకు ఏమీ చేయలేదన్నట్లుగా చెప్పే ఆయన.. అదే తెలంగాణకు పదేళ్లు పాలనాధికారిగా ఉంటూ చేయాల్సినంత చేశారా? అన్నది ప్రశ్న.

అంతేనా.. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ అనే మాటకు మరో ముచ్చటే లేదు. ఎవరెన్నిచేసినా.. ఎవరెన్ని చెప్పినా.. సోనియాగాంధీ కనుక తెలంగాణ ఇవ్వకూడదని అనుకున్న పక్షంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదన్నది నిజం. కానీ.. ఈ విషయాన్ని సమయానుకూలంగా మర్చిపోయే కేసీఆర్.. ఇప్పుడు తన అధికారానికి ఎక్కడ గండి పడుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని.. ఆ పార్టీ అధినేత్రిని సైతం మాటలు అనేందుకు ఏ మాత్రం ఆలోచించరు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు.. తెలంగాణ సమాజం ఇచ్చిందేమిటి? అన్నది చూసినప్పుడు.. గుండు సున్నాగా చెప్పక తప్పదు. సాయం చేసినోళ్లకు అంతో కొంత తిరిగి ఇవ్వాలన్న మాటనే ప్రాతిపదికగా తీసుకుంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు కనీసం ఒక టర్మ్ పాలనను ఇవ్వాల్సిందే. అయితే.. కేసీఆర్ మాటలు మాత్రం మరోలా ఉంటాయి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. మరి.. ఇదే కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన వేళ.. ఇదే కాంగ్రెస్ ను.. ఇదే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను ఆకాశానికి ఎత్తేయటం చూశాం. అంటే.. తనకు నచ్చినప్పుడు ఒకలా.. తన చేతిలో ఉన్న అధికారం చేజారిపోతున్న వేళ మరోలా మాట్లాడటం సరికాదు కదా? అన్న ప్రశ్నవినిపిస్తోంది.

Tags:    

Similar News