ఆ ఛండాలం వీడియో చూస్తే.. పోలీసులకు దొరికిపోతారు

చేసేది తప్పుడు పని అని తెలిసినా.. నాలుగు గోడల మధ్య గుట్టుగా మన సొంత మొబైల్ ఫోన్లో చూస్తే ఏమవుతుందన్న ధీమా అస్సలే వద్దు

Update: 2024-10-01 03:52 GMT

చేసేది తప్పుడు పని అని తెలిసినా.. నాలుగు గోడల మధ్య గుట్టుగా మన సొంత మొబైల్ ఫోన్లో చూస్తే ఏమవుతుందన్న ధీమా అస్సలే వద్దు. బూతు వీడియోల్లో అత్యంత దారుణమైన చిన్నారుల అశ్లీల వీడియోల్ని ఎంత రహస్యంగా చూసినా ఇట్టే దొరికిపోవటం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే.. ఈ తరహా వీడియోల్ని వీక్షించే వారిని ట్ర్రాక్ చేయటం కోసం మన పోలీసులు మాత్రమే కాదు.. అమెరికా నిఘా కూడా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఆగస్టు చివరి వరకు 520 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు అయ్యే నిందితుల్లో ఎక్కువ మందిపై అశ్లీల వీడియోల ప్రభావం ఉన్నట్లుగా వెల్లడవుతోందన్న విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాంతికేతను ఉపయోగించి.. చిన్నారుల అశ్లీల వీడియోలు చూసినా.. డౌన్ లోడ్ చేసినా.. వేరే వారికి ఫార్వర్డ్ చేసినా కూడా జైలు ఊచలు లెక్కేసేందుకు సిద్ధం కావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ఎవరికి వారి ఫోన్.. కంప్యూటర్ లో గుట్టుగా చూస్తున్నప్పుడు మూడో కంటికి తెలిసే అవకాశం లేదన్న ఆలోచన ఉంటే మార్చుకోవాలని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక ఆధారాలతో ఈ ఛండాలం వీడియోల్ని కనిపెడుతున్నారు. వాట్సాప్ గ్రూపులు.. సోషల్ మీడియా ద్వారా ఇతరులకుపంపుతున్న వైనాన్ని గుర్తించి.. అందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

మన పోలీసులతో పాటు విదేశీ దర్యాప్తు సంస్థలు సైతం చిన్నారుల అశ్లీల వీడియోల వ్యాప్తిపై ఫోకస్ చేస్తోంది. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్.. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్స్ తదితర సంస్థలు ఐపీ చిరునామాలతో ఆ సమాచారాన్ని కేంద్ర హోం శాఖకు అందిస్తాయి. అలా వచ్చిన సమాచార సాయంతో అరెస్టులు జరుగుతున్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వీడియోలను చూసిన వారిని అరెస్టు చేయటమే కాదు.. దాదాపు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుందన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. సో.. ఈ చండాలం వీడియోల విషయంలో జర జాగ్రత్తగా ఉండండి.

Tags:    

Similar News