సంతాన లేమికి ప్రధాన కారణాలేంటో తెలుసా..! సర్వేలో సంచలన విషయాలు
అయితే.. డెన్మార్క్‌లో నిర్వహించిన అధ్యయనంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో చాలా మందికి సంతాన లేమి సమస్యలు ఏర్పడుతున్నాయి. పెళ్లయి ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు అవుతున్నా కొంత మందికి పిల్లలు కలగడం లేదు. తీసుకునే ఆహార అలవాట్లు కానీ.. ఒత్తిళ్లు.. ఇతర కారణాలతో పిల్లలు పుట్టడం లేదు. ఇప్పటివరకు ఇవే కారణాలని అందరూ అనుకున్నారు. అయితే.. డెన్మార్క్‌లో నిర్వహించిన అధ్యయనంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా పల్లె ప్రజలు కూడా ఇప్పుడు పట్టణం బాటపడుతున్నారు. పిల్లల చదువు నిమిత్తం అని, ఉపాధి కోసం అంటూ పల్లెలు విడిచి పట్టణాలకు చేరుతున్నారు. అయితే.. పల్లెల్లో లభించిన స్వచ్ఛమైన గాలి పట్టణాల్లో దొరకదు. అక్కడి వాతావరణం ఇక్కడ కనిపించదు. ఎటుచూసినా ట్రాఫిక్.. ఎటుచూసినా వాహనాలతో నిండిపోయిన రహదారులే కనిపిస్తూ ఉంటాయి. వాటి వల్ల కాలుష్యం కూడా పెద్ద మొత్తంలో పెరుగుతోంది. మరోవైపు.. ట్రాఫిక్ వల్ల పెద్ద ఎత్తున సౌండ్స్ వింటూ ఉంటాం. ఇలా దీర్ఘకాలిక వాయు, శబ్ద కాలుష్యం ద్వారా కూడా సంతాన లేమి సమస్యలు వస్తున్నాయని ఆ అధ్యయనం వెల్లడించింది.
దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలాంటి నగరాన్ని తీసుకుంటే ఏటా అక్కడి ప్రజలను కాలుష్యం ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతోందో చూస్తూనే ఉన్నాం. ఇక చలికాలం వచ్చిందంటే చాలు.. సమస్య తీవ్రమై అక్కడి ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. ఢిల్లీతోపాటే దేశంలోని ముఖ్య నగరాల్లో ఈ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గాలి కాలుష్యం వల్ల గాలిలోని రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకి చొచ్చుకెళ్తాయట. అవి హర్మోన్లను అస్తవ్యస్తం చేస్తాయని అధ్యయనం తెలిపింది. అలా నేరుగా అండాలు, శుక్రకణాలనూ దెబ్బతీయొచ్చని శాస్ర్తవేత్తలు అందులో పేర్కొన్నారు.
ఆయా వ్యక్తుల ఆరోగ్యం, నివాస ప్రాంతం, ఉద్యోగం, చదువులు, కుటుంబ మధ్య అనుబంధాలపై ఈ అధ్యయనం చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సంతానలేమితో బాధపడుతున్న వారిలో కాలుష్యం భిన్నంగా ప్రభావం చూపుతున్నట్లు నిర్ధారణ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన దాని కన్నా పీఎం 2.5 మోతాదులు 1.6 రెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మగవారిలో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే.. 35 ఏళ్లు పైబడిన మహిళలకు వాహనాల శబ్దం 55 - 60 డెసిబెల్స్ కన్నా 10.2 డెసిబెల్స్ పెరిగితే ఈ ముప్పు 14శాతం ఎక్కువగా ఉంటున్నట్లు పేర్కొంది. అందుకే.. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు వాయు, శబ్ద కాలుష్యాలకు దూరంగా ఉండాలని సర్వే సూచించింది. అంతేకాదు.. సిటీకి దూరంగా పల్లెటూరులో ఉండి సంతానం కోసం ప్రయత్నాలు సాగించాలని పేర్కొంది.