చైనాను వణికిస్తున్న ‘బెంబికా’.. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా..

డ్రాగన్ కంట్రీ చైనా వణికిపోతోంది. తుపాన్ ఆ దేశాన్ని పగబట్టినట్లుంది.

Update: 2024-09-16 06:40 GMT

డ్రాగన్ కంట్రీ చైనా వణికిపోతోంది. తుపాన్ ఆ దేశాన్ని పగబట్టినట్లుంది. ఈ ఏడాది మొదలు నుంచి చైనా తుపాన్‌లను ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా.. మరో తుపానుతో బెంబేలెత్తుతోంది. ఈ తుపానుకు బెంబికా అనే పేరు పెట్టారు.

బెంబికా తుపాను నేపథ్యంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ తుపాన్ ప్రభావంతో చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో అలర్ట్ ప్రకటించారు. గత 75 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ నగరాన్ని తాకిన అతిపెద్ద తుపాన్ ఇదేనని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తుపాను షాంఘైని తాకినట్లు అక్కడి మీడియా సైతం వెల్లడించింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి చైనా ఇప్పటివరకు 16 తుపాన్లను ఎదుర్కొంది. ఆర్థిక నగరం షాంఘైని కూడా 1949లో టైపూన్ గ్లోరియా తర్వాత అంతటి స్థాయిలో తాకిన తుపాను ఇదే. తుపాను ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. షాంఘై తీరాన్ని తుపాను దాటడంతో అక్కడి ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది.

ఇదిలా ఉంటే.. ఈ తుపాను ఎదుర్కొనేందుకు అక్కడి అధికారులు ముందస్తు సన్నాహాలు చేశారు. ఇప్పటికే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. తుపాను దృష్టా్య షాంఘై జిల్లా నుంచి 9,318 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పారు. సిటీకి సమీపంలోని ఝౌషాన్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, దుకాణాలన్నింటినీ మూసేశారు. తుపాను ప్రభావంతో ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. గత 15 రోజుల్లో చైనాలో ఇది రెండో అతి పెద్ద తుపాను అని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News