చైనాలో విడాకులు అంత ఈజీకాదు.. 'జనం' కోసం కొత్త రూల్స్!
ఒకప్పుడు జనచైనా! అంటూ..ప్రపంచ దేశాల నుంచి పెదవి విరుపులు ఎదుర్కొన్న డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అదే జనాభా కోసం ఆపశోపాలు పడుతోంది
ఒకప్పుడు జనచైనా! అంటూ..ప్రపంచ దేశాల నుంచి పెదవి విరుపులు ఎదుర్కొన్న డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అదే జనాభా కోసం ఆపశోపాలు పడుతోంది. ఖచ్చితంగా పదేళ్ల కిందట వరకు.. దేశంలో జనభా రేటు ఎక్కువగా ఉండేది. అయితే.. పెరుగుతున్న జనాభాను కట్టడి చేసేందుకు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా దేశం ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయింది. వృద్ధులు పెరుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. ఇప్పుడు కనుక జననాల పెరగకపోతే.. 2050 నాటికి చైనాలో అందరూ వృద్ధులే ఉంటారన్నది లెక్క!!
అందుకే.. చైనా అధ్యక్షుడు జిన్ పిన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. వివాహాలను ప్రోత్సహించడంతో పాటు.. ప్రస్తుతం వివాహం చేసుకుని విడాకులు తీసుకునేవారి సంఖ్య ను తగ్గించాలని నిర్ణయించుకుంది. ఒకప్పుడు భారత్‌లోనూ ఇలాంటి వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇప్పుడు కూడా ఉంది. విడాకుల కోసం వెళ్తే.. భార్యా భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి.. కూలింగ్ పిరియడ్ ఇస్తారు. ఈలోగా వారి మనసులు మారి.. కాపురాలు సజావుగా చేసుకునేలా ప్రోత్సహిస్తారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాను చైనా కూడా అనుసరిస్తోంది. తద్వారా దేశంలో విడాకులు తగ్గడంతోపాటు.. వివాహ బంధాలు పటిష్టమై.. అది జననాలకు దారి తీస్తుందని అంచనా వేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా పెళ్లిళ్లకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులు తెస్తూ ముసాయిదాను ప్రజల ముందుకు తెచ్చింది. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటి వరకు ఉన్న ప్రాంతీయ నిబంధనలను తొలగించింది. హౌస్‌హోల్డ్ రిజిస్టర్ అవసరం లేదని పేర్కొంది. డ్రాఫ్ట్‌పై సెప్టెంబర్‌లోగా ప్రజలు అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం కోరింది.
ఎందుకిలా?
+ జనాభాను పెంచాలన్న ఉద్దేశం.
+ సహజీవనాలను తగ్గించాలన్న పట్టుదల.
+ చైనా సంస్కృతులు, సంప్రదాయాలకు పెద్దపీట వేయాలన్న సంకల్పం
+ కుటుంబ వ్యవస్థను పెంచాలన్న సదుద్దేశం.
+ దేశంలో తగ్గిపోతున్న వివాహాలను పెంచడం.
+ ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో 34.3 లక్షల మంది పెళ్లిళ్లు చేసుకొన్నారు.
+ 2023తో పోలిస్తే.. ఇది 4,98,000 తక్కువ.