సరిహద్దుల్లో.. చైనా సైనికులతో జైశ్రీరామ్ అనిపించిన భారత జవాన్లు

డెస్సాంగ్, డెమ్ చోక్ నుంచి వెళ్లిపోతున్న చైనా బలగాలతో భారత బలగాలు స్నేహపూర్వకంగా సంభాషించాయి. చాయ్, బిస్కెట్లు పంచుకున్నాయి.

Update: 2024-10-25 12:51 GMT

ప్రపంచం అంతా కొవిడ్ మహమ్మారితో సతమతం అవుతున్న వేళ.. అమెరికా సహా అన్ని దేశాలూ కొవిడ్ పుట్టింది చైనాలోనే అని నిందిస్తున్న సమయంలో.. ప్రపంచం ముంగిట డ్రాగన్ ఒక దోషిగా నిలిచిన కాలంలో.. అనూహ్యంగా ఓ సంఘటన జరిగింది.. ఎవరి మీద కోపమో.. ఎవరి మీదనో చూపినట్లు.. పొరుగున ఉన్న చైనా భారత్ పై కయ్యానికి కాలు దువ్వింది. గాల్వన్ లోయలో ఘర్షణలకు కారణమైంది. 2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌ గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఒక్కసారిగా తీవ్ర ఘర్షణ చెలరేగింది. తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. చైనా సైనికులు చనిపోయినా.. సంఖ్యను వెల్లడించలేదు. చాలా నెలల తర్వాత ఐదుగురు మాత్రమే మరణించినట్లు అంగీకరించింది. అనంతరం ఇరు దేశాలు ఎల్‌ఏసీ వెంట భారీగా బలగాలను మోహరించాయి. అప్పటినుంచి ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుసార్లు చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.

వాస్తవాధీన రేఖలో ఉద్రిక్తతల కలకలం అసలే చైనా.. ఆపై తరచూ అరుణాచల్ నుంచి లద్దాఖ్ వరకు ఉల్లంఘనలు. దీంతో లద్దాఖ్ లోని ఇరు దేశాల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట 2020 నుంచి కలకలమే. వీటికి ముగింపు పలకడం అధికారులు, విదేశాంగ మంత్రుల స్థాయిలో వీలు కాలేదు. అయితే, బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా కొద్ది రోజుల కిందట రష్యాలోని కజాన్ లో భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశం అయ్యారు. దీంతో ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా కీలక ఒప్పందం జరిగింది.

బలగాలు వెనక్కు..

దేశాధినేతల సమావేశం అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా చల్లారాయి. ఒప్పందం మేరకు సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ మొదలైంది. తూర్పు లద్దాఖ్‌ లోని కీలకమైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి బలగాలు శుక్రవారం వెనక్కి మరలాయి. సైనిక సామగ్రి, ఇతర పరికరాలను వెనక్కు తీసుకొస్తున్నాయి. టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను భారత్, చైనా బలగాలు తొలగిస్తున్నాయి. చార్దింగ్‌ లా పాస్‌ సమీపంలోని నదికి పశ్చిమం వైసపున భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. సరిహద్దులకు ఇరువైపులా 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు ఉన్నాయి. బలగాల ఉపసంహరణ తర్వాత 4-5 రోజుల్లో డెస్పాంగ్‌, డెమ్చోక్‌ లలో పెట్రోలింగ్‌ ను పునరుద్ధరిస్తారు.

ఎల్ఏసీ వెంట గస్తీ పునః ప్రారంభంపై భారత్-చైనా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. అంటే.. గల్వాన్‌ ఘర్షణలకు ముందు నాటి పరిస్థితి నెలకొంటుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. బ్రిక్స్‌ సదస్సులో ఈ ఒప్పందాన్ని మోదీ, జిన్‌ పింగ్‌ ధ్రువీకరించారు.

జై శ్రీరామ్ అని నినదించేలా..

డెస్సాంగ్, డెమ్ చోక్ నుంచి వెళ్లిపోతున్న చైనా బలగాలతో భారత బలగాలు స్నేహపూర్వకంగా సంభాషించాయి. చాయ్, బిస్కెట్లు పంచుకున్నాయి. ఈ సందర్భంగా చైనా సైనికులతో భారత జవాన్లు జై శ్రీరావ్ నినాదాలు చేయించారు. ఈ సీన్ భారత బలగాల్లో ఉద్వేగాన్ని రగిలించింది.

Tags:    

Similar News