చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను... ఆక్రమణకు మరింత దూకుడు!
ఈ క్రమంలో తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్ దిశగా పంపించడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
పొరుగు దేశాల భూభాగాలు, ఏకంగా పొరుగు దేశాలను ఆక్రమించుకునేందుకు దుందుడుకుతో ముందుకు సాగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా.. ఇప్పటికే భారత్‌తో అనేక వివాదాలు కొని తెచ్చుకుంది. భారత భూభాగంలోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక, కొన్ని దశాబ్దాలుగా వివాదంగా ఉన్న తైవాన్ దేశంపై తాజాగా చైనా కత్తి దూసింది. ఈ దేశం తమదేనని తరచుగా చెప్పుకొనే డ్రాగన్ కంట్రీ.. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలింది.
ఈ క్రమంలో తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్ దిశగా పంపించడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. చైనా పంపించిన 103 యుద్ధ విమానాల్లో 40 విమానాలు తైవాన్ జలసంధి 'మధ్య రేఖ'(మీడియేటర్ లైన్)ను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు.
ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్య అని పేర్కొన్న తైవాన్.. ఆ వ్యవధిలో తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది. ఈ చర్యను తైవాన్ రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోందని.. ఇలాంటి సమయంలో యుద్ధ విమానాలను తమపై ప్రయోగించడం.. మరింత ప్రమాదకర పరిస్థితికి ఆజ్యం పోయడమేనని తైవాన్ పేర్కొంది.
ఈ తరహా ఘటనలకు బాధ్యత వహించడంతోపాటు సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలని చైనాకు తైవాన్ ప్రభుత్వం సూచించింది. మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ 'మధ్య రేఖ' అంటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని మరింత సంచలన వ్యాఖ్య చేశారు. మొత్తంగా ఈ పరిణామం చూస్తే.. చైనా ఇక, తైవాన్‌పై యుద్ధం ప్రకటించినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
తైవాన్‌లో రాజకీయ అస్థిరతకు ఆజ్యం చైనా దూకుడుతో తైవాన్‌లో రాజకీయ అస్థిరతకు ఆజ్యం పోసినట్టు అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తైవాన్ ఎన్నికల మూడ్‌లో ఉంది. అక్కడ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇలాంటి సమయంలో తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం ప్రస్తుత అధ్యక్షుడికి రాజకీయ సంకటంగా మారింది. దీనిని నిలువరించలేక పోతున్నారంటూ.. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తున్నాయి.