చిన్నజీయర్ మొహం చూడొద్దనుకుంటున్న కేసీఆర్?
అయితే, ఈ కార్యక్రమం సందర్భంగా అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయని వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది
గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల గురించి పరిచయం చేయనక్కర్లేదు. రాజకీయంగా తనకు ఎదురుదెబ్బ తగిలితే దాన్ని తెలివిగా ఎలా తిప్పుకొట్టాలనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అదే సమయంలో, అసలు ఎదురుదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించడంలో కూడా ఆయనది అందెవేసిన చేయి. ఒకనాటి తన ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ విషయంలో అలాంటి ఓ పొలిటికల్ డెసిషన్ తాజాగా కేసీఆర్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే, బీఅఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పాలకుర్తి మండలం వల్మీడీ కొండపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నేడు శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములచే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరు అయ్యారు. అనంతరం మండల కేంద్రంలో పాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
అయితే, ఈ కార్యక్రమం సందర్భంగా అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయని వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సకల ఏర్పాట్లు చేసేశారు. జిల్లా అధికారులు సైతం పూర్తిగా పనుల్లో నిమగ్నమై ఉండిపోయారు. అయితే హఠాత్తుగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు.
అయితే, ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడానికి శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామియే కారణమని ప్రచారం జరుగుతోంది. శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములచే చేయిస్తుండటం, దీంతోపాటుగా ఆయన సన్నిహితుడనే పేరొందిన వ్యాపారవేత్త మైహోం రామేశ్వరరావు విచ్చేస్తుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలమాలో పడ్డట్లు సమాచారం. ఇటు జీయర్ స్వామి, అటు మైహైం రామేశ్వరరావు తనకు స్టాట్యూ ఆఫ్ యూనిటీ సమయంలో ఇచ్చిన 'గౌరవం' ఆ సమయంలో జరిగిన రాజకీయ రచ్చ నేపథ్యంలో ఇప్పుడు ఈ విగ్రహ ప్రతిష్టాపనకు హాజరవడం ద్వారా అనవసరంగా చర్చకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి భావించి ఉంటారని చెప్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ దగ్గరవుతుందన్న ప్రచారాన్ని విపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రమాదం ఉందనే బీఆర్ఎస్ అధినేత ఈ ముందు జాగ్రత్త తీసుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు.