అమరావతి పూర్తవ్వాలంటే వందేళ్ళుట !

ఏపీకి రాజధాని కావాలి. అది మంచి రాజధాని అయి ఉండాలి. వీలైతే హైదరాబాద్ ని తలదన్నాలి.

Update: 2024-10-24 04:02 GMT

ఏపీకి రాజధాని కావాలి. అది మంచి రాజధాని అయి ఉండాలి. వీలైతే హైదరాబాద్ ని తలదన్నాలి. రాజధాని ఎందుకు అంటే అక్కడ పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి. దాని వల్ల వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే భారం తప్పుతుంది.

సొంత రాష్ట్రంలో హాయిగా ఉండొచ్చు. ఇది యువత కోరిక అయితే ఏపీలోనే బిజినెస్ చేయాలనుకునే వారికి రాజధాని తొందరగా కావాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావాలి. అదే విధంగా సగటు ప్రజలకు మేలు చేయాలంటే ప్రభుత్వాలకు ఒక మంచి రాజధాని కావాలి.

ఇలా అందరికీ రాజధానితో అవసరం ఉంది. మరి అలాంటి రాజధాని పరిపూర్తికి ఎంతకాలం పడుతుంది అంటే టీడీపీ పెద్దలు చెబుతున్న దానిని బట్టి చూస్తే మూడేళ్ళు. ఇటీవలనే అమరావతిలో పనులను తిరిగి ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి.

ఆయన మాటలనే తీసుకుంటే అమరావతి రాజధాని మూడేళ్ళకు పూర్తి అయితే అందరికీ ఎంతో సంతోషంగానే ఉంటుంది. కానీ అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని వెనకటి ప్రభుత్వం అంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని టీడీపీ పెద్దలు అంటున్నారు.

అమరావతిలో తొలిదశ పనులకు 49 వేల కోట్లు ఖర్చు అవుతాయని మంత్రి నారాయణ అంటున్నారు. అయితే ప్రపంచ బ్యాంక్ రుణమో దానికి కేంద్రం పూచీకత్తు కాదు ఏకంగా తానే తిరిగి తీర్చివేసి ఏపీకి చేసే సాయమో తెలియదు కానీ ఆ మొత్తం వస్తుంది. అయితే అది ఎంతదాకా సరిపోతుంది అన్న చర్చ ఉండనే ఉంది.

అమరావతికి వరదలు ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలంటే మరింతగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ అదనపు ఖర్చుని కూడా లెక్క వేస్తే తడిసిమోపెడే. ఇక అమరావతికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు 131 దాకా వస్తాయని వాటికి భూములు కేటాయించారు. అందులో ఎన్ని వస్తాయో అవి ఎంతకాలం పడుతుందో తెలియదు. మరి ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. కానీ వారు కూడా అన్నీ అక్కడ ఉంటేనే తప్ప తాముగా ముందుకు అడుగు వేయరు కాబట్టి ముందు అమరావతి ఒక రూపూ షేపూ రావాలి.

ఇంతకీ అమరావతి ఎప్పటికి పూర్తి అవుతుంది అంటే కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చెప్పినది చూస్తే ఎవరికి అయినా షాక్ కొడుతుంది. ఏకంగా వందేళ్ళ కాలం పడుతుంది అని చింతా మోహన్ అంటున్నారు. అప్పటికి కానీ అమరావతి రాజధాని పూర్తి కాదు అని ఆయన తేల్చి చెప్పేస్తున్నారు.

అంటే ఇప్పట్లో కాదు కొన్ని తరాల వరకూ అమరావతి పూర్తి కాదు అన్న చర్చ అయితే వస్తోంది. అయితే కేంద్ర మాజీ మంత్రి చెప్పినది కూడా చూస్తే కనుక దేశంలో ఏ రాజధాని కూడా పూర్తిగా అభివృద్ధి చెందాలీ అంటే సుదీర్ఘ కాలమే తీసుకుంటుంది అని చెప్పాలి. ఓవర్ నైట్ లో ఏ రాజధానీ నిర్మాణం కానే కాదు. అందుకే ఆయన ఆ మాట చెప్పి ఉంటారని అంటున్నారు.

ఇక ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి మీద చింతా మోహన్ సెటైర్లు పేల్చారు. తెలంగాణాలో రాజభోగం మాదిరిగా సెక్రటరేట్ ఉంటే ఏపీలో మాత్రం నాలుగు షెడ్లు వేసి అదే సెక్రటేరియట్ అని చెప్పి సరిపుచ్చుకోవాల్సిన నేపథ్యం ఉందని అన్నారు. ఉమ్మడి ఏపీ విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది అని చింతా మోహన్ అన్నారు. దళితులు విభజించబడిపోవడం, ఐక్యత లేకపోవడం వల్ల కూడా ఏపీ విభజన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీ సీఎం గా 14 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు సీఎం అయ్యారన్న మాటే కానీ ఆయన ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. వంద రోజులలో ఒక్క మంచి పని కూడా జరగలేదని అన్నారు. పెన్షన్లు పెంచడం తప్ప మరే పథకం అమలు కాలేదని అన్నారు. మరో వైపు చూస్తే విశేష అనుభవం కలిగిన చంద్రబాబు ఏపీకి బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టలేకపోయారు అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News