జగన్ బెయిల్ రద్దు చేయిస్తారా ?

ఏపీలో వైసీపీ మళ్ళీ జూలు విదిలిస్తోంది. అది సహజం కూడా. అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటే తప్పకుండా విపక్షం వైపు జనాలు చూస్తారు.

Update: 2024-10-05 03:55 GMT

ఏపీలో వైసీపీ మళ్ళీ జూలు విదిలిస్తోంది. అది సహజం కూడా. అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటే తప్పకుండా విపక్షం వైపు జనాలు చూస్తారు. వైసీపీ తప్ప అపోజిషన్ లో కనుచూపు మేరలో మరో పక్షం లేదు. అదే వైసీపీ అదృష్టం.

వైసీపీ నుంచి ఎంత మంది నేతలను తీసుకున్నా వైసీపీకి అసలైన బలం జగన్ అన్నది తెలిసిందే. ఆయన పట్టుదల కూడా 2019 కు పదేళ్ళు ముందు ఏపీ అంతా చూసింది. జగన్ సీఎం సీటు వైపు చూస్తూ తన యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తూ వచ్చారు. చివరికి దానిని ఆయన పట్టుకోగలిగారు

ఇపుడు కూడా పోయిన చోటనే వెతుక్కోవాలని ఆయన చూస్తున్నారు. ఇక ఏపీలో జగన్ కి 40 శాతం ఓటు షేర్ ఉంది. ఇది చాలా పెద్ద ఓటు బ్యాంక్. ఎపుడు అధికారం చేతులు మార్చేది పది శాతం ఓట్లే. అవి అటు నుంచి ఇటు మారితే అధికారం మార్పు సంభవిస్తుంది.

దాంతో అయిదేళ్ళ కూటమి పాలనలో ఆ పది శాతం వైసీపీ తెచ్చుకోవడం కష్టమేమీ కాదు అన్నది కూడా ఉంది. దాంతో వైసీపీని కీలక వర్గాలకు దూరం చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వేయని ఎత్తు లేదు, చేయని ప్రయత్నమూ లేదు అని చెప్పుకున్నారు.

అయితే ఎన్ని చెప్పినా అవన్నీ రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతున్నాయి తప్ప తీవ్ర ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ వైసీపీ మీద వేసిన బాణం మొదట్లో బాగా క్లిక్ అయింది. అయితే ఇపుడు సుప్రీంకోర్టు సీబీఐ ఆధ్వర్యంలో విచారణ అని ఆదేశాలు ఇవ్వడంతో విషయం కొత్త మలుపు తిరిగింది.

ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ అన్నది రాజకీయంగా మారుతోంది అన్నది కూడా జనాలు నెమ్మదిగానే గ్రహించారు. దాంతో దాని వల్ల టీడీపీ కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అయితే చంద్రబాబుకు పవన్ కి ఒక బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు.

జగన్ ని దెబ్బ తీయాలి అంటే శ్రీవారి లడ్డూలు ఇతర విషయాలు కాదబ్బా అని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం వద్ద చంద్రబాబుకు పవన్ కి విశేషమైన పలుకుబడి ఉందని ఈ ఇద్దరూ ఏమి చెప్పినా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాంటపుడు జగన్ బెయిల్ ని రద్దు చేయించేందుకు ఎందుకు ప్రయత్నం చేయరని ప్రశ్నించారు.

అదే చేస్తే కనుక వైసీపీకి జగన్ కి బిగ్ షాక్ తగులుతుందని అన్నారు. అంతే తప్ప దేవాలయాల మీద దేవుడి మీద అనుమానాలు పెంచి దానితో రాజకీయాలు చేయడం తప్పు అని చింతా మోహన్ హిత బోధ చేశారు. లడ్డూ ప్రసాదాలలో కల్తీ అన్నది నిజమే అని తాను భావిస్తున్నాను అని ఆయన అంటూనే అందులో కలిపితే పామాయిల్ లాంటివి కలపవచ్చేమో కానీ జంతువుల కొవ్వు కలపడం అన్నది అసాధ్యమని అన్నారు.

ఈ విషయాన్ని తాను గట్టిగా చెప్పగలను అన్నారు. మరి చింతా మోహన్ చంద్రబాబుకు పవన్ కి ఇచ్చిన ఈ సలహాను వారు తీసుకుంటారా జగన్ బెయిల్ ని రద్దు చేయించగలరా అన్న చర్చ సాగుతోంది. జగన్ విషయానికి వస్తే ఆయన ఆదాయనికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని 2012 మే లో అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ఏకంగా 16 నెలలు జైలులోనే ఉన్నారు 2013 సెప్టెంబర్ లో బెయిల్ మీద బయటకు వచ్చారు.

అంటే ఇప్పటికి ఆయన 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటున్నట్లుగా లెక్క అని చెబుతారు. ఇంత సుదీర్ఘ కాలం బెయిల్ మీద ఉండే వారు ఎవరూ లేరని కూడా జగన్ ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. అయితే జగన్ కి బెయిల్ ఇచ్చారు. కేసు విచారణ సాగుతోంది.

ఆయన బెయిల్ ని రద్దు చేయవచ్చు కానీ ఆయనను జైలుకు పంపితే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న చర్చ కూడా ఉంది. ఆయన మీద మరింతగా సానుభూతి కూడా వస్తుంది అన్నది కూడా రాజకీయంగా తలపండిన వారు చెబుతున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు ప్రత్యర్ధి ఊసు పెట్టకుండా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీద ఫోకస్ పెడితే బాగుంటుంది కదా అని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News