క్రిమినల్ కేసుల్లో చింతమనేని సరికొత్త రికార్డ్.. ప్రస్తుతానికి పరారీ!
దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! "చత్రపతి" సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్.. "రాజకీయం, రౌడీయిజం ఒక్కటి కాదురొరేర్" అనేది తప్పు అని నిరూపించాలనుకుంటారో ఏమో తెలియదు కానీ... తాజాగా క్రిమినల్ కేసులున్న నేతల్లో ఈయన సరికొత్త రికార్డ్ నెలకొల్పారని అంటున్నారు.
చింతమనేనిపై ఈ నెల 16న తాజాగా మరో కేసు నమోదైంది. ఇందులో భాగంగా... ఐపీసీ సెక్షన్ 224, 225, 143, 353, 149 కింద కేసులు నమోదు చేశారు. అయితే... ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదవ్వగా.. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది! ఆ రికార్డ్ సంగతి కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నది పాయింట్!
అవును... దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. అందుకు గల కారణం ఇప్పుడు చూద్దాం...! ఈ నెల 13న పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
దీంతో... విషయం తెలుసుకున్న చింతమనేని భారీ సంఖ్యలో అనుచరులను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి స్టేషన్ లో ఉన్న నిందితుడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో అంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో... చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో... విషయం తెలుసుకున్న చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారని తెలుస్తుంది. అక్కడ నుంచి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసిందని తెలుస్తుంది. ఈ కేసును నూజివీడు డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు! ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, బెంగళూరుల్లో వీరికోసం ఏపీ పోలీసు టీమ్స్ గాలిస్తున్నాయని సమాచారం!