తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చెప్పేసిన ఏపీ మాజీ ఎంపీ
టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు సరికాదని.. ఆయన చాలా మంచివారన్న చింతా మోహన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తెలంగాణలో జరగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయంపై సంచలన లెక్కల్ని చెప్పుకొచ్చారు ఏపీకి చెందిన మాజీ ఎంపీ చింతా మోహన్. తన లెక్కలతో అందరి చూపు తన మీద పడేలా చేశారు. మొత్తం 119 స్థానాల్లో 75 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న అంచనా వేసిన ఆయన.. ఏపీలోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగిందని వ్యాఖ్యానించటం గమనార్హం.
తెలంగాణ ఎన్నికల్లోఈసారి కాంగ్రెస్ విజయం తథ్యమన్న ఆయన.. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక.. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన.. తమిళనాడు తరహాలో ఏపీ రాజకీయాలు మారాయన్న ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు సరికాదని.. ఆయన చాలా మంచివారన్న చింతా మోహన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
చంద్రబాబును వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉందని.. ఈ మధ్యన కొన్ని వ్యవస్థల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తుందన్న వ్యాఖ్యలు చేవారు. చంద్రబాబు తప్పు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించిన ఆయన.. కేవలం ఆయనపై ఉన్న ఆరోపణలతోనే అరెస్టు చేయటం సరికాదన్నారు. రాహుల్ గాంధీని ఏ రీతిలో అయితే ఇబ్బంది పెడుతున్నారో.. అదేరీతిలో చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
చంద్రబాబును 37 రోజులుగా జైల్లో ఉంచటం సరికాదన్న ఆయన.. వాజ్ పేయ్.. పీవీ నరసింహరావుల కుట్రల కారణంగానే అప్పట్లో అద్వానీపై కేసులు పెట్టారని.. దీంతో ఆయన ఇప్పటివరకు ప్రధాని కాలేకపోయినట్లుగా వ్యాఖ్యానించి కొత్త సంచలనానికి తెర తీశారు.
ఇప్పుడంటే పెద్దగా లైమ్ లైట్ లో లేరు కానీ.. గతంలో తిరుపతి ఎంపీగా తన అధిక్యతను స్పష్టంగా చూపించి.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించేవారు. పలు అంశాలపై చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.