ఏమిటీ ఈ జోక్స్... చిరంజీవి సీఎం చేస్తారా?
తాజాగా మైకులముందుకు వచ్చిన తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్... చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు... బీజేపీ, కాంగ్రెస్ లు సైతం రాబోయేది తమ ప్రభుత్వమే అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఆత్మస్తుతి పరనింద పాలసీలో భాగంగా... గత ఎన్నికల్లో నోటాతో పోటీపడిన పార్టీల నేతలు సైతం భారీ డైలాగులు పేలుస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చిరంజీవిని సీఎం చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత! దీంతో... ఇది ఈ ఏటి మేటి హాస్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... తాను రాజకీయాలకు సూట్ కానని భావించిన చిరంజీవి ఆల్ మోస్ట్ ఆ రంగానికి దూరంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ.. తన రంగంలో తాను దూసుకుపోతున్నారు.. అందరివాడిలా కొనసాగుతున్నారు. ఈ సమయంలో ఏపీలో సత్తా చాటాలని, పూర్వ వైభవం సాధించాలని తపనపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు.. తాజాగా చిరంజీవిపై ఆసక్తికరవ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా... సీఎం సీటు ఆఫర్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు.
కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్... ఏపీలోనూ సత్తా చాటాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్ షర్మిళను పార్టీలో చేర్చుకుని, ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించారు. ఈ సమయంలో కొంతమంది సీనియర్లు.. పార్టీకి పూర్వ వైభవం వచ్చే దశ ప్రారంభమైందనే కామెంట్లు చేస్తున్నారు. ఇంతకాలం ఉన్నారో లేరో అన్నట్లుగా ఉన్న పలువురు నేతలు మైకులముందుకు రావడం మొదలుపెట్టారు.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మైకులముందుకు వచ్చిన తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్... చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీచేస్తే ఆయన్ని 50 వేల మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత తనదని అన్నారు. ఇదే సమయంలో చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని.. పశ్చిమగోదావరిలో ఆయనకు ప్రాథమిక సభ్యత్వం ఉందని తెలిపారు.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ముఖ్యమంత్రి కావడం ఖాయమని చింతా మోహన్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో గెలవబోతుందని జోస్యం చెప్పిన ఆయన... ముఖ్యమంత్రి కావాలనే కాపుల కోరిక ఈసారి తీరబోతుందని అన్నారు. అందుకు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరుపున తిరుపతి నుంచి పోటీ చేయడమే తరువాయి అన్నస్థాయిలో మోహన్ చెప్పుకొచ్చారు.
కాగా రాజకీయాలనుంచి చిరంజీవి ఆల్ మోస్ట్ దూరంగా జరిగినట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఆ మధ్యకాలంలో "గాడ్ ఫాదర్" సినిమాలోని ఒక డైలాగ్ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు" అనే డైలాగ్ వైరల్ అయ్యింది.
అనంతరం చిరు చేసిన ఈ డైలాగ్ కి సంబంధించిన ట్వీట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమి చేయలేనని చిరంజీవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... చిరంజీవిని సీఎం చేసేస్తామంటూ కాంగ్రెస్స్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించడంపై సెటైర్లు పేలుతున్నాయి!!