మెగా ట్విస్ట్... చిరు ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అయ్యాడా?
ఏపీలో నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో అసలు సిసలు రాజకీయం మొదలైంది. పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడం మొదలైంది
ఏపీలో నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో అసలు సిసలు రాజకీయం మొదలైంది. పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. ఈ సమయలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగానే అంటూ గతంలో ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేసారు. ఈ సందర్భంగా... కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్దించారు. దీంతో... ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!
అవును... ఏపీలో ఎన్నికల వేళ చిరంజీవి తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు. బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన అభ్యర్దిగా బరిలోకి దిగిన పంచకర్ల రమేష్ బాబు ఇద్దరూ.. చిరంజీవిని కలిసారు. ఈ సందర్భంగా ఒక వీడియో విడుదల చేసారు. అందులో స్పందించిన చిరంజీవి... తాను చాలా కాలం తరువాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... రాజకీయాల గురించి మాట్లాడటం చాలా కాలం తర్వాత ఇప్పుడే జరుగుతుంది అని మొదలుపెట్టిన చిరంజీవి... పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం మంచి పరిణామం అని తెలిపారు. మరీ ముఖ్యంగా... తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్, తన బ్లెస్సింగ్స్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంచకర్ల రమేష్ లు అనకాపల్లిలో ఒకరు ఎంపీగా, మరొకరు పెందుర్తి ఎమ్మెల్యేగా నిలబడటం తనకు చాలా సంతోషంగా ఉందని చిరు తెలిపారు.
వీరిద్దరూ మంచివాళ్లే కాకుండా సమర్ధవంతులు అని.. ఇలాంటి వాళ్లు ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారనే నమ్మకం తనకు ప్రగాఢంగా ఉందని తెలిపారు. మరి ముఖ్యంగా సీఎం రమేష్ కు కేంద్రంలోని పెద్దలతో ఉన్న సంబంధాలు మరీ ప్రత్యేకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ కున్న పరిచయాలు అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని చిరు తెలిపారు.
ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులూ వీరిద్దరికీ ఉండాలని చిరు కోరారు! వీరిద్దరినీ గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని అంతా చూస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి.. దానికి మీరందరు నడుం బిగించండి.. ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నట్లు చిరు తెలిపారు! దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి..
వాస్తవానికి చిరంజీవి రాజకీయంగా ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారనే చెప్పాలి. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగబాబు, పవన్ లు చిరుని కలవడం, ఆయన జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం అందించడం తెలిసిందే. నాటి నుంచీ జనసేనకు, కూటమికీ చిరు పరోక్ష మద్దతు ఉందనే కామెంట్లు బలంగా వినిపించాయి! మరో పక్క తమ్ముడి పార్టీకి ఒక అన్నగా ఆర్ధిక సహాయం మాత్రమే చేశారనే చర్చా వినిపించింది.
ఈ సమయంలో కూటమికి చిరు మద్దతు అంశానికి బలం చేకూరుస్తూ... బీజేపీ, జనసేన అభ్యర్థులను పక్కపక్కన కూర్చోబెట్టుకుని, వాళ్లను గెలిపించాలని, ఫలితంగా.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని చిరంజీవి కోరడంతో.. ఆయన మద్దతుపై సందేహాలు తొలగిపోయినట్లే అని అంటున్నారు. మరోపక్క బీజేపీ, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించటంపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండానే ఎన్డీఏ కూటమి అభ్యర్దులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు! ఇవి ఏ తరహా రాజకీయాలకు నిదర్శనమో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క చిరంజీవి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరుపున సీఎం అభ్యర్థి ఆయనే అంటూ తిరుపతి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రకటించడం తెలిసిందే!
ఏది ఏమైనా... కూటమి అభ్యర్థులకు మెగాస్టార్ చిరంజీవి ఇలా తన మద్దతును బహిరంగా ప్రకటిస్తూ.. వీరి విజయానికి సహకరించాలని, ఫలితంగా ఆయా నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని భరోసా ఇవ్వడం కూటమికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ విషయాన్ని కూటమి ఎంత ప్రమోట్ చేసుకోగలిగితే అంత ప్రయోజనం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
ఇదే సమయాల్లో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చిరు ఎంట్రీ ఇలా పరోక్షంగానే ఉంటుందా.. లేక, ప్రత్యక్షంగానూ ఉండే అవకాశాలున్నాయా అనేది ఆసక్తిగా మారింది. కూటమి అధికారంలోకి వస్తే చిరుకి తగిన గౌరవం దక్కే విషయంపైనా చర్చలు మొదలైపోయాయి! ఏది ఏమైనా... ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఇది మెగా ట్విస్ట్ అనే చెప్పాలి.. కూటమికి బూస్ట్ అనే భావించాలి!!