హైదరాబాద్లో ముగ్గురు మొనగాళ్ల మీటింగ్! చంద్రబాబు, రేవంత్ రెడ్డి, చిరంజీవి అరుదైన కలయిక?
తెలుగు వారి కళ్లల్లో ఆనందం నింపే ఈ ఘట్టం ఎప్పుడు ఆవిష్కృతం అవుతుందా? అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకోబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తెలుగు వారి బ్రాండ్ అంబాసిడర్లుగా భావించే ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలుగు వారి కళ్లల్లో ఆనందం నింపే ఈ ఘట్టం ఎప్పుడు ఆవిష్కృతం అవుతుందా? అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ నెల 3 నుంచి 5 వరకు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభల దైవార్షిక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు తెలుగు దిగ్గజాలు అంతా హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఎందరికో ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో ఈ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని తెలుగు వాళ్లంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ లో ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంప్రదాయాలు, తెలుగు వారి వారసత్వంపై ఈ మహాసభల్లో చర్చించనున్నారు. తెలుగు వారి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందజేయడం ఈ మహాసభ ప్రధాన ఉద్దేశం. అనేక రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరు అవుతున్నందున నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జనవరి 3న ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. జనవరి 5న ముగింపు వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మహాసభల్లో తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామక దిగ్గజాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులను కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రమ్మంటూ ఆహ్వానాలు పంపారు. అదేవిధంగా ఈ మహాసభల్లో 10 మంది తెలుగు ప్రముఖులకు బిజినెస్ అచీవర్స్ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నటరత్న నందమూరి బాలక్రిష్ణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు సినీ నటులు జయప్రద, జయసుధ, దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్ తోపాటు మరికొంత మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఐతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖలు అంతా ఒకేసారి కార్యక్రమానికి వస్తారా? వేర్వేరుగా హాజరవుతారా? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు.