సీఏఏపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ముస్లిం సోదరుల్ని సీఏఏకి వ్యతిరేకంగా కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లలో హింసను ఎదుర్కొని భారత్ కు వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశమని అమిత్ షా తేల్చిచెప్పారు. ఏ ఒక్కరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడం కోసం కాదని అని స్పష్టతనిచ్చారు. సీఏఏ అమలుకు ముందు దానికి సంబంధించిన నిబంధనలను తప్పక జారీ చేస్తామన్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని హరించదని తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించడానికే ఈ చట్టమని స్పష్టం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024లో పాల్గొన్న అమిత్ షా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. ఇక ఓవరాల్ గా ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయన్నారు. తాము ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను అని అమిత్ షా చెప్పారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ ఏమీ లేదని.. ఈసారి కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలన్నీ మళ్లీ ప్రతిపక్షంలోనే ఉంటాయన్నారు.
రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ), శిరోమణి అకాలీదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అనే ప్రశ్నకు తాము ఫ్యామిలీ ప్లానింగ్ ను నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదు అని సమాధానమిచ్చారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపైన అమిత్ షా మండిపడ్డారు. 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్ర చేయడానికి అర్హత లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ.. 2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉందన్నారు. అన్నీ కుంభకోణాలే ఉన్నాయన్నారు. విదేశీ పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. అప్పుడే శ్వేతపత్రం ఇచ్చి ఉంటే.. ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేదన్నారు.
2014 నుంచి ఈ పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెట్టిందని అమిత్ షా తెలిపారు. అవినీతి లేదని.. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయన్నారు. అందుకే తాము శ్వేతపత్రాన్ని తెచ్చామని చెప్పారు.
రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500 ఏళ్లపాటు నమ్మారని గుర్తు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కారణంగానే ఆ కల ఇన్నాళ్లపాటు ఆలస్యమైందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం రామ మందిరాన్ని పూర్తి చేసిందని చెప్పారు.