అంత పెద్ద ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు.. చిన్న లాజిక్ మిస్ అవుతున్నారా?
అధికారం కోసం ఎంతకైనా అన్నట్లుగా వ్యవహరించే వారు చాలామందే ఉంటారు.
అధికారం కోసం ఎంతకైనా అన్నట్లుగా వ్యవహరించే వారు చాలామందే ఉంటారు. అయితే.. సదరు అధికారం లిమిటెడ్ సమయానికి మాత్రమే అన్న విషయం తెలిసినప్పుడు ఎలా వ్యవహరించాలి? అన్న ప్రశ్నకు మెడ మీద తలకాయ ఉన్న వాడు ఎవడు కూడా తొందరపాటు తప్పులు చేయరు. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారు. సేఫ్ గేమ్ ఏమంటే.. రూల్ బుక్ కు అనుగుణంగా పని చేయటం.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం దాని నుంచి బయటకు వచ్చి పని చేయటం. కానీ.. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా మారాయి.
దేశంలోనే అత్యుత్తమ అధికారులుగా చెలామణీ అయ్యే ఐఏఎస్ లు..ఐపీఎస్ లు ఒక పక్షానికి కొమ్ము కాసే దరిద్రపుగొట్టు ట్రెండ్ షురూ అయి కొన్నేళ్లు అయ్యింది. కొందరు అధికారుల పేర్లు చెప్పినంతనే ఫలానా పార్టీకి ఫేవర్ గా పని చేసే వారన్న మాట ఇట్టే వచ్చేసే పరిస్థితి. నిజానికి పదేళ్ల క్రితం కూడా ఇప్పుడున్నంత దారుణ పరిస్థితి ఉండేది కాదు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఐఏఎస్ లు కాస్తా అయ్యాఎస్ లుగా మారటం.. అధికార పక్షానికి అణిగిమణిగి ఉండే అవలక్షణం అంతకంతకూ ఎక్కువైంది. చూస్తుండగానే వ్యవస్థలో ఇదో క్యాన్సర్ గా మారింది.
దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వెంట్లుగా ఉన్న వారిలో ఎక్కువమంది మిస్ అయ్యే లాజిక్ ఏమంటే.. మంచి పోస్టింగ్ కోసం అధికార పక్షం ఎదుట వంగటం మొదలు పెడితే.. అది అక్కడితో ఆగకపోగా.. ఆ తర్వాత తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి తెర తీసే పరిస్థితి. వైఎస్ హయాంలో ఇదే తరహాలో సాగటం.. ఆ తర్వాత కేసుల్లో చిక్కుకొని జైలుపాలైన అధికారుల సంగతి తెలిసిందే.
అధికారంలో ఉన్నప్పుడు తామేం చేసినా ఫర్లేదన్నట్లుగా వ్యవహరించే దోరణి ఓకే అయినా.. ఆ తర్వాతేమిటి? అన్నది ప్రశ్న. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికార బదిలీ జరగటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పలువురు ఐపీఎస్ ల మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావటం.. అందులో కొందరు గాయబ్ కావటం తెలిసిందే. స్వల్పకాలిక అధికారం కోసం గీత దాటేసే అధికారులకు తర్వాతి కాలంలో తిప్పలు తప్పవన్న విషయం తరచూ నిరూపితం అవుతున్నా.. కొందరి తీరులో మాత్రం మార్పు రాని పరిస్థితి.
ఎందుకిలాంటి తప్పులు చేస్తారు? అంటే.. తమ ప్రతిభకు తగ్గ పోస్టులు రాకపోవటం.. చూస్తుండగానే సర్వీసు కరిగిపోతున్న వేళలో.. కాస్త గీత దాటి మంచి పోస్టు తెచ్చుకుంటే కెరీర్ బాగుంటుందన్న తొందరపాటు.. తర్వాతి కాలంలో వారి ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని మిస్ కావటం కనిపిస్తుంది. అందలం ఎక్కాలన్న హడావుడిలో చేసే తప్పులు స్వల్పకాలం ప్రయోజనంగా ఉన్నా.. తర్వాతి కాలంలో వారు అధ:పాతాళానికి జారిపోయే దుస్థితి.
ఇప్పటికే పలువురు ఐఏఎస్.. ఐపీఎస్ లకు ఈ చేదు అనుభవం ఎదురైనప్పటికి అదే తప్పుల్ని చేయటం రోటీన్ గా మారింది. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండే వారు.. తాము నమ్ముకున్న వారి అధికారం పరిమిత సమయానికి మాత్రమేనని.. ఎవరి చేతుల్లోనూ పవర్ శాశ్వితంగా ఉండదన్న చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారన్నది పాయింట్. ఈ సత్యాన్ని తెలుసుకున్న పలువురు తమ పనితనం మీదనే ఫోకస్ చేస్తారే తప్పించి.. మంచి పోస్టింగుల కోసం తాపత్రయపడరు. అలాంటి వారి కెరీర్ కలర్ ఫుల్ గా ఉండకపోవచ్చు. కానీ.. కేసులు.. కష్టాలమయంగా మాత్రం ఉండదని చెప్పక తప్పదు.