ఆ సీటు నాకు ఇవ్వండి.. కాదు నాకే ఇవ్వండి: బీజేపీలో నేతల కొట్లాట
ఈ క్రమంలో సీనియర్ నేతల మధ్య టికెట్ల పంచాయతీ రగడగా మారిందని తెలిసింది.
ఇతర పార్టీల మాదిరిగానే జాతీయ పార్టీ బీజేపీలోనూ సీట్ల కోసం కొట్లాట జరుగుతోందా? మాకు ఇవ్వాలంటే మాకేటికెట్ ఇవ్వాలంటూ.. నాయకులు పంచాయతీ పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నాయకు లు ప్రస్తుతం నాలుగు రోజులుగా ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నాయకులు ఢిల్లీలోనే తిష్ట వేశారు. టికెట్ల పందేరంపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నేతల మధ్య టికెట్ల పంచాయతీ రగడగా మారిందని తెలిసింది.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, మరోసీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావుల మధ్య జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే మాటల యుద్ధం జరిగినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నాయకులు కూడా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. వేర్వేరు నియోజకవర్గాలు కాకుండా.. ఇద్దరూ కూడా విశాఖపట్నంపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం.. ఇద్దరూ పార్టీ అధిష్టానానికి కావాల్సిన నాయకులు కావడంతో వీరిద్దరిని సముదాయించలేక పోతున్నట్టు తెలిసింది.
``నేను గత మూడేళ్లుగా విశాఖపైనే ఎక్కువగా దృష్టి పెట్టా. అనేక కార్యక్రమాలు చేపట్టా. ఈ సీటు నాకు ఇవ్వాల్సిందే. నేను గెలిచి మోడీకి కానుకగా ఇస్తా`` అనిజీవీఎల్ పట్టుబట్టినట్టు సమాచారం. ఇదేసమయంలో మరింత బిగ్గరగా దగ్గుబాటి కూడా .. ఈ సీటు తనకు అచ్చి వచ్చిన నియోజకవర్గమని.. గతంలో తాను ఇక్కడ గెలిచి అనేక కార్యక్రమాలు చేపట్టానని.. మహిళా సెంటిమెంటు కూడా పార్టీకి వర్కవుట్ అవుతుందని.. ఇప్పటికే వైసీపీ మహిళను ఇక్కడ పోటీకి పెట్టిందని కాబట్టి తనకే ఇవ్వాలని పురందేశ్వరి కూడా పట్టుబట్టినట్టు సమాచారం.
ఇక, ఇతర నియోజకవర్గాల విషయంలోనూ సిఎం రమేష్, సోము వీర్రాజుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలిసింది. ఇద్దరూ అనకాపల్లి పార్లమెంటు కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. అదేవిధంగా రాజమండ్రి, శ్రీకాకుళం, పాతపట్నం సీట్లపైనా ఒకరికి మించి నాయకులు పట్టు బడుతుండడంతో పార్టీకి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి.