అనకాపల్లికి అయ్యన్న కీలకమా...!?
మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ కి అనకాపల్లి గెలుపు కంటే సొంత కూటమిలో అందరినీ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగడమే అసలైన అగ్ని పరీక్ష అని అంటున్నారు.
అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో గేర్ మార్చేవారు ఎవరు అన్న చర్చ సాగుతోంది. టీడీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కనుక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అనకాపల్లిలో ఉన్నారు. అలాగే నర్శీపట్నంలో మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఇక మూడు ప్రధాన సామాజిక వర్గాలు మెజారిటీగా ఉన్న సీటు అనకాపల్లి పార్లమెంట్.
దాంతో ఈ సీటులో గెలవాలంటే ఆయా సామాజిక వర్గాలలో బలంగా ఉంటూ దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న వారి అందరి మద్దతూ అవసరమే అని అంటున్నారు. మరో వైపు చూస్తే వెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన అనకాపల్లి టికెట్ ని తన కుమారుడు విజయ్ కి అడిగారు. కానీ హై కమాండ్ పొత్తులో సీటుని బీజేపీకి ఇచ్చేసింది.
ఇపుడు బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఆయన అపుడే గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. ఆయన తరఫున ఆయన సోదరుడు సీఎం రాజేష్ అనకాపల్లిలో ల్యాండ్ అయిపోయారు. సీఎం రమేష్ గెలుపు కోసం రాజకీయ మంత్రాంగాన్ని ఆయన ప్రారంభించారు.
ముందుగా ఆయన కలుసుకున్నది మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని కావడం విశేషం. వ్యూహాత్మకంగానే ఆయన అయ్యన్నను కలిశారు అని అంటున్నారు. అయ్యన్న అసంతృప్తిగా ఉంటే ఇబ్బంది అవుతుందని భావించే ఇలా చేశారు అని అంటున్నారు. అయ్యన్నపాత్రుడుకి నర్శీపట్నం మాడుగుల తదితర నియోజకవర్గాలలో పట్టు ఉంది. పైగా ఈ నియోజకవర్గాలలో వెలమలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆయననే కలసి సీఎం రమేష్ సోదరుడు గెలుపు కోసం సహకారం కోరారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే బీజేపీకి అనకాపల్లిలో పెద్దగా పట్టు లేదు. ఆ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే 13,276 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు అంతకంటే ఎక్కువగా అంటే 34,897 ఓట్లు వచ్చాయి. దాంతో పూర్తిగా టీడీపీ మీదనే ఆధారపడి సీఎం రమేష్ పోటీ చేస్తునారు అని అంటున్నారు. సీఎం రమేష్ గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన వారు కాబట్టి ఆయనకు ఇపుడు టీడీపీలో సాయం చేసే వారు చాలా మందే ఉంటారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ముందుగానే అయ్యన్నను మంచి చేసుకుంటే మిగిలిన వారిని కూడా తమ వైపునకు తిప్పుకోవచ్చు అన్నది ఒక ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు కూడా సీఎం రమేష్ విజయానికి సహకరిస్తాను అని మాట ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబుకు కూడా అత్యంత సన్నిహితుడిగా టీడీపీలో ముద్రపడ్డారు కాబట్టి సీఎం రమేష్ విషయంలో రెండవ ఆలోచన లేకుండా టీడీపీ పనిచేస్తుంది అని అంటున్నారు.
ఇక అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకి కూడా పట్టుంది. ఆయన సాయం కూడా అవసరం. అయితే అయ్యన్నకు దాడికి గతంలో వర్గ పోరు సాగేది. ఇపుడు దాడి సొంత పార్టీలోకి వచ్చారు. దాంతో దాడి మళ్లీ చక్రం తిప్పుతారా అన్న చర్చ సాగుతోంది. ఆయన పార్టీలోకి తిరిగి వచ్చింది ఎమ్మెల్యే సీటు లేదా ఎంపీ సీటు తన కుమారుడికి ఇప్పించుకోవడానికి. అయితే రెండు సీట్లూ దక్కలేదు.
దాంతో దాడి మౌనంగా ఉన్నారని అంటున్నారు. అందరూ కలవాలి. అందరితో కో ఆర్డినేషన్ చేసుకోవాలి. ఎవరికి పెత్తనం ఇచ్చినా రెండవ వారు ఆగ్రహిస్తారు. సున్నితమైన అంశాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి. మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ కి అనకాపల్లి గెలుపు కంటే సొంత కూటమిలో అందరినీ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగడమే అసలైన అగ్ని పరీక్ష అని అంటున్నారు.