అనకాపల్లి ఎంపీ సీటు : సీఎం రమేష్ రికార్డు సృష్టిస్తారా...!?

ప్రతీ నియోజకవర్గానికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని అధిగమించి గెలవడం అంటే ఏటికి ఎదురీడడమే.

Update: 2024-04-03 04:07 GMT

ప్రతీ నియోజకవర్గానికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని అధిగమించి గెలవడం అంటే ఏటికి ఎదురీడడమే. అక్కడ ప్రజలు అలా తమ భావావేశాన్ని చూపిస్తారు. వాటితో కనెక్ట్ అయి ఉంటారు. అలాంటిదే ఒక కీలక నియోజకవర్గం ఏపీలో ఉంది. అదే అనకాపల్లి ఎంపీ సీటు.

ఈ సీటు ప్రత్యేకత చెప్పుకోవాలంటే చాలానే ఉంది. ఈ సీటు నుంచి ఎందరో ప్రముఖులు గెలిచి పార్లమెంట్ కి వెళ్లారు. అయితే వారంతా స్థానికులే. నాన్ లోకల్స్ అంటే మాత్రం అనకాపల్లి ఓటర్లు తిప్పికొడుతూ వస్తున్నారు. 1962లో ఏర్పడిన అనకాపల్లి పార్లమెంట్ కి ఇప్పటిదాకా 15 సార్లు ఎన్నికలు జరిగితే దాదాపుగా అన్ని సార్లూ స్థానికులే ఎంపీలు అయ్యారు.

అదే విధంగా రెండు సార్లు బ్రాహ్మణ సామాజిక వర్గం అభ్యర్ధి గెలిచారు. అది తొలి ఎన్నికల్లోనే. ఆ తరువాత నుంచి చూస్తే గవరలు, వెలలంలు కాపులే ఎంపీలు అవుతున్నారు. గత అయిదున్నర దశాబ్దాలుగా ఈ మూడు సామాజిక వర్గాల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది.

ఇక 1999లో ఈ సీటు నుంచి గంటా శ్రీనివాసరావు ఎంపీగా గెలిచారు. ఆయన అప్పటికి విశాఖలో పదిహేనేళ్ళుగా స్థిరపడి ఉన్నారు. దాంతో ఆయనను నాన్ లోకల్ గా భావించలేదు జనాలు. అదే 2009లో ఒక సినీ నిర్మాత అల్లు అరవింది ఒక పత్రికాధిపతి నూకారపు సూర్యప్రకాశరావు అనకాపల్లి నుంచి ఎంపీలుగా ప్రజారాజ్యం, టీడీపీ తరఫున పోటీ చేశారు. కానీ పక్కా లోకల్ అయిన కాంగ్రెస్ అభ్యర్ధి సబ్బం హరి గెలిచారు. అది అనూహ్యమైన విజయంగా అంతా భావించారు. దానికి కారణం లోకల్ నే జనాలు ఎంపిక చేసుకున్నారు అన్న మాట.

ఇక 2024లో అనకాపల్లికి చెందిన సీఎం రమేష్ బీజేపీ నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన టీడీపీ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన పక్కా లోకల్ మాత్రమే కాదు, బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.

దాంతో ఈసారి అనకాపల్లి ఎంపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇద్దరు అభ్యర్థులు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అయితే నాన్ లోకల్ కార్డుని వైసీపీ తీస్తోంది. తనకు అనకాపల్లి అంతా తెలుసు అని బూడి అంటున్నారు. సీఎం రమేష్ నాన్ లోకల్ అని ఆయనని గెలిపించవద్దు అంటున్నారు.

ఈ విషయంలో కూటమి జవాబు చెప్పలేని స్థితిలో ఉంది అని అంటున్నారు. ఇక సీఎం రమేష్ ఈ సీటు నుంచి పోటీ చేయడం ఒక విధంగా సవాల్ గానే చూస్తున్నారు. అయితే నలభై రోజుల దాకా సమయం ఉండడంతో ఆయన అప్పటికి అన్నీ సర్దుకుంటాయని అంటున్నారు. ఆయన కనుక గెలిచి చూపిస్తే అనకాపల్లి సెంటిమెంట్ని తిరగరాసినట్లే. నాన్ లోకల్స్ కూడా గెలవగలరు అంటూ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లే. చూడాలి మరి సీఎం రమేష్ రాజకీయ అదృష్టం ఏ విధంగా ఉందో.

Tags:    

Similar News